శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో అదిరిపోయే ప్రదర్శన చేసిన యువ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను బుమ్రాకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించానని, కానీ పని జరగలేదని చెప్పాడు. తొలి టీ20 ముగిసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాలు వెల్లడించాడు. అసలేం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (89), శ్రేయాస్ అయ్యర్ (57 నాటౌట్), రోహిత్ శర్మ (44) సత్తాచాటారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 199/2 స్కోరు చేసింది.
లక్ష్య ఛేదనలో లంకేయులు 20 ఓవర్లకు 137/6 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో భారత జట్టు 62 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారీ లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. ఈ క్రమంలోనే తను కూడా బౌలింగ్ చేయాలని శ్రేయాస్ అనుకున్నాడట. ‘‘బౌలింగ్ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా. ‘‘16వ ఓవర్ వద్ద రోహిత్‌ను అడిగితే ఏ బౌలర్లు బౌలింగ్ చేస్తారో బుమ్రాకు అప్పుడే చెప్పేశానని అన్నాడు. నేను వెళ్లి బుమ్రాకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించా. కానీ పని జరగలేదు’’ అంటూ నవ్వేశాడు.
సౌతాఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్‌లో తొలిసారి బౌలింగ్ చేస్తూ కనిపించిన శ్రేయాస్.. తనను తాను ఆల్‌రౌండర్‌గా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ శర్మ కూడా జట్టులో స్థానం కోసం అతను ఆల్‌రౌండర్‌గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఇంతకు ముందే పలుమార్లు నొక్కి చెప్పిన సంగతి తెలిసిందే.