శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు కుదురుకోలేకపోతున్నారు. ఆరంభంలోనే మయాంక్ (33), రోహిత్(29) త్వరగా అవుటవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీ (45), హనుమ విహారి (58)పై పడింది. వీరిద్దరూ కుదురుకున్నట్లే కనిపించినా ఆ తర్వాత స్వల్పవ్యవధిలోనే క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో రిషభ్ పంత్ (28 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (27) ఇన్నింగ్స్ నిలబెట్టేందుకు ప్రయత్నించారు.
సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ మంచి షాట్లు ఆడాడు. కానీ 62వ ఓవర్లో డిసిల్వా వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. గుడ్ లెంగ్త్‌లో వేసిన బంతిని డిఫెండ్ చేసుకోవడానికి శ్రేయాస్ ప్రయత్నించాడు. కానీ అతని బ్యాట్‌ను తప్పించుకున్న బంతి నేరుగా వెళ్లి ప్యాడ్‌ను తాకింది. అంపైర్ అవుటిచ్చినా అయ్యర్ రివ్యూ కోరాడు.
రివ్యూలో కూడా క్లియర్‌గా ఎల్బీడబ్ల్యూ అని తేలడంతో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. 228/5తో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత పంత్, జడేజాపై పడింది. మరి తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఎంత స్కోరు చేస్తుందో చూడాలి.