లంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఏకంగా 62 పరుగుల తేడాతో గెలిచింది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఒక విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. అదే ఫీల్డింగ్. ఒకప్పుడు ప్రపంచ అత్యుత్తమ ఫీల్డింగ్ జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా.. లంకతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా మూడు క్యాచులు జారవిడిచింది. యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ నేరుగా వచ్చిన క్యాచ్‌ను జారవిడవగా.. బౌండరీ లైన్ వద్ద సులభంగా వచ్చిన క్యాచ్‌ను సరిగా అంచనా వేయలేక శ్రేయాస్ అయ్యర్ వదిలేశాడు.
ఆ తర్వాత వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక క్యాచ్ జారవిడిచాడు. దీనిపై మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ‘‘ఇలా జరుగుతూనే ఉంది. చాలా సులభమైన క్యాచులను మేం జారవిడుస్తున్నాం. మా ఫీల్డింగ్ కోచ్‌కు చాలా పని ఉంది. ఆస్ట్రేలియా వెళ్లే సరికి మేం మంచి ఫీల్డింగ్ జట్టుగా ఉండాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు.
బ్యాటింగ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్ (89), రోహిత్ శర్మ (44), శ్రేయాస్ అయ్యర్ (57 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 199 పరుగులు చేసింది. 200 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన లంకేయులను భువనేశ్వర్ కుమార్, వెంకటేశ్ అయ్యర్ చెరో రెండు వికెట్లతో మట్టికరిపించారు. చాహల్, జడేజా కూడా చెరో వికెట్ తీయడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. మొత్తం 20 ఓవర్లు ముగిసే సరికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.