టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (96) సెంచరీకి అడుగు దూరంలో అవుటయ్యాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడిన పంత్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఇన్నింగ్స్ 90వ ఓవర్ ఐదో బంతికి లక్మల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. లెంగ్త్ బాల్‌ను డిఫెండ్ చేయడానికి పంత్ ప్రయత్నించాడు. కానీ ఒక్క క్షణం అలసత్వం ప్రదర్శించడంతో బ్యాటును తప్పించుకున్న బంతి ఆఫ్‌స్టంప్ బెయిల్‌ను పడగొట్టింది. దీంతో నిరాశగా క్రీజులో కూర్చుండిపోయాడు పంత్. అం
తకుముందు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) త్వరగా అవుటైపోయారు. ఆ తర్వాత హనుమ విహారి (58), విరాట్ కోహ్లీ (45) కుదురుకున్నట్లే కనిపించినా భారీ స్కోర్లు చేయకుండానే పెవిలియన్ చేరారు. అప్పుడు క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ (27)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు.
కాసేపటికే అయ్యర్ అవుటవడంతో జడేజా (35 నాటౌట్)తో కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే డ్రింక్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత కాసేపు టీ20 తరహా బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించిన పంత్.. సెంచరీ చేస్తాడని అంతా ఎదురు చూశారు. కానీ సెంచరీ చేయకుండానే అతను పెవిలియన్ చేరడంతో భారత జట్టు 333/6 స్కోరుతో నిలిచింది.