Team India | కొలంబో: శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి జోరుమీదున్న భారత్కు వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మొదటి వన్డే ‘టై’గా ముగిసింది. శ్రీలంక నిర్దేశించిన 231 పరుగుల ఛేదనలో భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగుల వద్దే ఆలౌట్ అవడంతో మ్యాచ్ టై అయింది.
స్వల్ప ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (47 బంతుల్లో 58, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా అక్షర్ పటేల్ (33), కెఎల్ రాహుల్ (31), శివమ్ దూబె (25) ఫర్వాలేదనిపించారు. 47.3 ఓవర్లప్పుడు దూబె ఫోర్ కొట్టి స్కోర్లను సమం చేసినా ఆ తర్వాత వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో టీమ్ఇండియాకు నిరాశ ఎదురైంది. లంక బౌలర్లలో కెప్టెన్ అసలంక (3/30), హసరంగ (3/58) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దునిత్ వెల్లలగె (2/39) బంతితో పాటు బ్యాట్ (67)తోనూ మెరిశాడు. లంక ఇన్నింగ్స్లో వెల్లలగె, పతుమ్ నిస్సంక (56) అర్థ సెంచరీలతో ఆ జట్టు పోరాడే స్కోరును సాధించింది.