బెంగళూరు టెస్టులో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపిస్తోంది. బ్యాటర్లంతా వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురూ సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏంజెలో మాథ్యూస్ (43) మరో వికెట్ కోల్పోకుండా ఆదుకున్నాడు.
అతని తర్వాత వచ్చిన ధనంజయ డిసిల్వా (10), చరిత్ ఆసలంక (5) కూడా తీవ్రంగా నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో నిరోషన్ డిక్కవెల్లా (12 నాటౌట్), లసింత్ ఎంబుల్డెనియా క్రీజులో ఉన్నారు. మాథ్యూస్, డిక్కవెల్లా ఏర్పరచిన 35 పరుగుల భాగస్వామ్యమే శ్రీలంక ఇన్నింగ్స్‌లో టాప్ అంటేనే వారి బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మాథ్యూస్ చాలా కాలం తర్వాత కొంచెం టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అలాంటి సమయంలో 29వ ఓవర్లో బుమ్రా వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. దాన్ని అతను ఆడబోవడంతో ఎడ్జ్ తీసుకొన్న బంతి సెకండ్ స్లిప్‌లో ఉన్న రోహిత్ చేతుల్లోకి వెళ్లింది. ఆ ఓవర్‌ను బుమ్రా మెయిడెన్‌గా ముగించాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 86/6 స్కోరుతో నిలిచింది.