IND Vs SA T20 | భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరుగనున్నది. ప్రస్తుతం సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ టీ20 మ్యాచ్‌లో గెలిచి టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తుండగా.. దక్షిణాఫ్రికా సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలనే కృతనిశ్చయంతో ఉన్నది. లక్నోలో జరగాల్సిన భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగో మ్యాచ్ భారీ పొగమంచు కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కీలకమైన టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల వరుసగా భారీ ఇన్నింగ్స్‌ను ఆడడంలో సూర్య విఫలమవుతున్నాడు. ప్రస్తుతం టీమిండియాకు సూర్య ఫామ్ ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఏడాది 20 టీ20 మ్యాచులు జరగ్గా.. 18 ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ సమయంలో 14.20 సగటుతో 213 పరుగులు చేశాడు.
మరోవైపు, లక్నో మ్యాచ్‌కు ముందే గిల్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డ విషయం తెలిసిందే. మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండే అవకాశాలు లేకపోవడంతో టాప్ ఆర్డర్‌లోకి సంజు శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దాంతో భారత జట్టుకు ఓపెనింగ్‌లో ఇబ్బందులు తీరినట్లే. శాంసన్ రూపంలో ప్రత్యామ్నాయం ఉన్న నేపథ్యంలో భారత జట్టు ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడే అవకాశం లేదు. అయితే, శాంసన్ ఓపెనర్‌గా రాణించాడు. కానీ, లోయర్ ఆర్డర్లో పెద్దగా రాణించలేకపోయాడు. ఇక ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఇద్దరూ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నందున భారత జట్టు సమతుల్యంగా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ఇద్దరూ రాణించారు. వ్యక్తిగత కారణాలతో మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా నాలుగో మ్యాచ్‌కు ముందు జట్టులో చేరాడు. బుమ్రా తిరిగి వచ్చిన తర్వాత ప్లేయింగ్ ఎలెవన్‌లో హర్షిత్‌కు అవకాశం వస్తుందా? లేదా? చూడాల్సిందే. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దాంతో బౌలర్లు సవాల్‌గా మారనున్నది.
భారత జట్టు (అంచనా) : అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా జట్టు (అంచనా) : రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రూవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.