సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడిన రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ పారేసుకున్నాడు. ఎన్గిడీ వేసిన రెండో ఓవర్ ఐదో బంతిని గ్యాప్‌లో బాది బౌండరీ సాధించిన రుతురాజ్..
ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఎన్గిడీ అద్భుతంగా వేసిన బంతిని సరిగా ఆడలేకపోయిన అతను కీపర్ డీకాక్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ మరుసటి ఓవర్లోనే శ్రేయాస్ అయ్యర్ (4) కూడా పెవిలియన్ చేరాడు.
మార్కో జాన్సెన్ వేసిన మూడో ఓవర్ చివరి బంతిని నేరుగా ఆడేందుకు ప్రయత్నించిన శ్రేయాస్.. మిస్ అయ్యాడు. దాంతో బంతి అతని ప్యాడ్లను తాకింది. అప్పీల్ చేసినా అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో సౌతాఫ్రికా జట్టు రివ్యూ కోరింది. దానిలో బంతి నేరుగా ప్యాడ్లనే తాకినట్లు తేలింది. అలాగే అది వికెట్లను కూడా కూల్చుతుందని హాక్ ఐలో కనిపించింది. దాంతో అంపైర్ తన నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. భారత జట్టు మూడు ఓవర్లు ముగిసే సరికి 24 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.