Ind Vs SA | కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక కుప్పకూలింది. దక్షిణాఫ్రికా దాదాపు 15 సంవత్సరాల తర్వాత తొలిసారిగా భారత్‌లో టెస్టులో విజయం సాధించింది. అయితే, ఈడెన్ గార్డెన్ పిచ్‌ను స్పిన్ అనుకూలంగా తయారు చేయించి.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలన్న టీమిండియా వ్యూహం బెడిసికొట్టింది. ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులోకి దించి విజయం సాధించాలని భావించగా.. టీమిండియా బ్యాటర్లు దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్లను ఎదుర్కోలేక వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మ్యాచ్ తర్వాత టీమిండియా స్పిన్ వ్యూహాన్ని గంభీర్ సమర్థించుకున్నాడు. స్పిన్ అనుకూల పిచ్‌ను తయారు చేయాలని చెప్పినట్లుగా హెడ్‌కోచ్ స్పష్టం చేశారు. టీమిండియా వ్యూహంపై పలువురు మాజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మాజీ హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సైతం ఘాటుగా స్పందిస్తూ.. ఇది ‘టెస్ట్ క్రికెట్ విధ్వంసం’గా అభివర్ణించాడు. ఈ పరిస్థితులు ప్లేయర్స్ అభివృద్ధికి ఆటంకంగా మారుతాయని చెప్పాడు. ‘వారు టెస్ట్ క్రికెట్‌ను పూర్తిగా నాశనం చేశారు. టెస్ట్ క్రికెట్‌కు హృదయపూర్వక నివాళి’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్లో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘వారు స్పిన్‌కు అనుకూల పిచ్‌లు తయారు చేస్తూ టెస్ట్ క్రికెట్‌ని పూర్తిగా నాశనం చేస్తున్నారు.ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పిచ్‌లు తయారు చేస్తున్నారు. కానీ, దీనిగురించి ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే ఇన్నాళ్లు బాగానే ఉందని, జట్టు గెలిచినప్పుడు ప్రతీది బాగానే కనిపిస్తుంది. ఎవరో వికెట్లు తీయడంతో జట్టు గెలిచింది. వికెట్లు పడగొట్టినవారంతా గొప్ప క్రికెటర్లుగా మారారు. ప్రతి ఒక్కరూ ప్రతీది బాగా జరుతుందని భావిస్తారు. ఈ ధోరణి ఇప్పుడే ప్రారంభం కాలేదు. ఇది సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇది తప్పుడు మార్గమని భావిస్తున్నాను.
ఈ సమస్యను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అలాంటి పిచ్‌లు ఆటగాళ్ల అభివృద్ధికి దోహదపడవు. క్రీజును వదిలి ముందుకురావడం లేదు. మీరు మిల్లుకు కట్టిన ఎద్దులా తిరుగుతున్నారు. ఇలాంటి పిచ్‌లు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో ఆలోచించాల్సిన సమయం ఇది. ఇక్కడ మీ బ్యాట్స్‌మెన్ పరుగులు ఎలా స్కోర్ చేయాలో తెలియదు. వారు ఎలా బ్యాటింగ్ చేయాలో తెలియనట్లు కనిపిస్తున్నారు. మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బ్యాటర్లు అవుట్ కాలేదు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడంతో అవుట్ అయ్యారు. పరిస్థితులు పూర్తిగా బౌలింగ్‌కే అనుకూలిస్తే సమర్థుడైన బౌలర్, బ్యాట్స్మెన్ల మధ్య తేడా ఏంటీ? టెస్ట్ క్రికెట్‌ను చూస్తే బాధగా ఉంది. మనం ఇలా ఎందుకు చేస్తున్నామో నాకు తెలియదు’ అంటూ హర్భజన్ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉండగా.. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 22 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానున్నది.