IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయి వేదికగా ఆదివారం జరుగనున్నది. బంగ్లాదేశ్‌తో గెలుపుతో టోర్నీలో బోణీ కొట్టింది టీమిండియా. మరో వైపు ఆతిథ్య జట్టు పాక్ జట్టు న్యూజిలాండ్‌పై తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానున్నది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీస్‌కు అవకాశాలు ఉంటాయి. పాకిస్తాన్‌కు డూ ఆర్ డై మ్యాచ్ కాగా.. డిపెండింగ్ చాంపియన్ టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు అవకాశం ఉండగా.. సెమీస్ ఆశలు కష్టతరంగా మారుతాయి.
ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్‌పై భారత జట్టు ఆదిపత్యం చెలాయిస్తూ వస్తున్నది. రెండు జట్ల మధ్య దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. ఇక్కడ వన్డేల్లో భారత్‌కు అజేయ రికార్డు ఉన్నది. ఈ మైదానంలో భారత్-పాక్ మధ్య జరిగిన వన్డేల్లో రెండుసార్లు గెలిచింది. దుబాయిలో ఆడిన అనుభవం భారత్‌కు చాలానే ఉంది. జట్టు ప్రయోజనకరంగా ఉండనున్నది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు ఉపఖండ జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ 2017 ఫైనల్లో జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది. పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని జట్టు.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచేందుకు శాయశక్తులా రాణించేందుకు ప్రయత్నిస్తారు. అయితే, పాక్ ఆటగాళ్లు మూడు విభాగాల్లోనూ రాణించాల్సిందే. భారత్ -పాకిస్తాన్ జట్లు ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగిన సమయంలో ప్లేయర్స్‌పై భారీగానే ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో ఆటగాళ్లు మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. అన్ని విభాగాల్లో రాణించిన జట్టే విజేతగా నిలుస్తుంది. అయితే, పరిస్థితులను ఎదుర్కోవడంలో భారత్ జట్టు కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు రోహిత్, విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నది. కానీ, బంగ్లాదేశ్‌పై బ్యాటింగ్ చేసిన విధానాన్ని చేస్తూ తన మళ్లీ టచ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. తొలి మ్యాచ్‌లో 41 పరుగులు భారత్‌కు మంచి ఆరంభం అందించాడు. దాన్ని భారీ స్కోరుగా మలచుకోలేకపోయాడు. ఇక విరాట్ కోహ్లీ సైతం పెద్ద స్కోర్ చేయలేకపోవడం భారత్‌కు భారీ ఆందోళన కలిగిస్తున్నది. గత కొంతకాలంగా మునుపటిలా మ్యాచ్‌పై దృష్టి సారించలేకపోతున్నాడు. ఇక పాకిస్తాన్‌పై భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం టీమిండియాకు ఊరట కలిగించే విషయం. గత మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో బంగ్లాపై 229 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయపడింది.
వాస్తవానికి సాధారణంగా రోహిత్ శర్మ ఒక మ్యాచ్‌లో గెలిస్తే.. రెండో మ్యాచ్‌కు ఆ జట్టును మార్చడు. గత మ్యాచ్‌లో గెలిచిన జట్టులో టీమిండియా పెద్దగా మార్పులు చేసేందుకు అవకాశాలు కనిపించడం లేదు. పిచ్ స్పిన్నర్లకు సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో కొనసాగడం ఖాయం. మరో వైపు వరుణ్ చక్రవర్తికి పాకిస్తాన్‌పై ఆడే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. వరున్ను తుదిజట్టులోకి తీసుకోవాలని భావిస్తే మాత్రం.. కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. టీమ్ మేనేజ్మెంట్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టేందుకు ఇష్టపడకపోవచ్చు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ.
పాకిస్థాన్: బాబర్ అజామ్, ఇమామ్ ఉల్-హక్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్-వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.