దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడమే కాకుండా కీలక వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఇఫ్తికార్ (28)ను అవుట్ చేసిన పాండ్యా.. నిలకడగా ఆడుతున్న మహమ్మద్ రిజ్వాన్ (43)ను కూడా పెవిలియన్ చేర్చాడు. పాండ్యా వేసిన షార్ట్ బంతిని డీప్ థర్డ్ దిశగా ఆడేందుకు రిజ్వాన్ ప్రయత్నించాడు.
అయితే అది సరిగా కనెక్ట్ కాకపోవడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఆవేష్ ఖాన్ వేగంగా వచ్చి క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే ఖుష్దిల్ షా (2)ను కూడా పాండ్యా వెనక్కు పంపాడు. పాండ్యా వేసిన బంతిని బలంగా బాదేందుకు అతను ప్రయత్నించాడు. ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని జడేజా పట్టేశాడు. దాంతో ఖుష్దిల్ కూడా పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ జట్టు 97 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.