టీ20 ప్రపంచకప్ ఆరంభ పోరులో పాకిస్తాన్‌పై భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో గురువారం నాడు పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఏమైనా మార్పులుంటాయా? కీలకమైన ఆటగాళ్లకు విశ్రాంతినిస్తారా? అంటే అసలు ఆ ఆలోచనే లేదని తేల్చేశాడు టీమిండియా బౌలింగ్ కోచ్ పరస్ మాంబ్రే.
అలాగే ఈ టోర్నీలో భారత జట్టు ప్రధాన స్పిన్నర్ అశ్విన్ అని, మరో స్పిన్నర్ అవసరం అయితేనే చాహల్‌ను ఆడిస్తామని స్పష్టం చేశాడు. కొన్ని రోజుల క్రితం ఆసియా కప్‌లో కూడా పాక్‌తో మ్యాచ్ తర్వాత హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో పాండ్యాను పక్కన పెట్టారు. పాండ్యాను కీలకమైన మ్యాచ్‌ల కోసం జాగ్రత్తగా కాపాడుకోవాలనేదే జట్టు యాజమాన్యం యోచన.
ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని, పాండ్యా కూడా అన్ని మ్యాచులు ఆడాలని కోరుకుంటున్నాడని మాంబ్రే తెలిపాడు. జట్టులో పాండ్యా చాలా కీలకమైన ఆటగాడని, అతను జట్టులో ఎంతో బ్యాలెన్స్ తీసుకొస్తాడని వివరించాడు. అతనికి నెదర్లాండ్స్ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వాలని అనుకోవడం లేదన్నాడు. అలాగే ప్రధాన స్పిన్నర్‌గా అశ్విన్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశాడు.
ఆసీస్ పిచ్‌లపై స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించదని, అశ్విన్ జట్టులో ఉండటం వల్ల బ్యాటింగ్‌లో కూడా డెప్త్ పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి జట్టు, వాతావరణం వంటివి పరిగణనలోకి తీసుకొని తప్పనిసరి అయితేనే జట్టులో మార్పులు చేస్తామని, లేదంటే ఇదే జట్టును కొనసాగిస్తామని వెల్లడించాడు. షమీ కూడా మంచి షేప్‌లో ఉన్నాడని, ఒత్తిడిని అర్షదీప్ అద్భుతంగా తట్టుకుంటున్నాడని మాంబ్రే పేర్కొన్నాడు.