IND vs NED: బెంగళూరు వేదికగా చిన్నస్వామి లో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా రికార్డుల మోత మోగించింది. టాప్ – 5 బ్యాటర్ల అర్థ సెంచరీ ప్లస్ స్కోర్లు, కెఎల్ రాహుల్ ఫాస్టెస్ట్ సెంచరీ, వరల్డ్ కప్‌లో అత్యధిక స్కోరు వంటి వాటితో పాటు మరిన్ని రికార్డులను తమ ఖాతాలో జమచేసుకుంది. ఆ రికార్డుల జాబితాను ఇక్కడ చూద్దాం.
టాస్ గెలిచి భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌కు వచ్చిన టాపార్డర్ బ్యాటర్లు ఐదుగురు (రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, కెఎల్ రాహుల్) ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేశారు. వరల్డ్ కప్ చరిత్రలో ఇదే ప్రథమం. వన్డే చరిత్రలో ఇలా జరగడం మూడో సారి మాత్రమే. గతంలో 2013, 2020లలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండు వన్డేలలో ఇలా జరిగింది.
ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్.. 62 బంతుల్లోనే శతకం పూర్తిచేశాడు భారత్ తరఫున వరల్డ్ కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే. అంతకుముందు టీమిండియా సారథి రోహిత్ శర్మ ఇదే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ పై 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
HUNDRED FOR KL RAHUL…!!!!
The local boy has done it at Chinnaswamy, What a knock, this will be remembered forever in his career – he has been unbelievable at number 5 in ODIs. pic.twitter.com/r81yw7OeU0
— Johns. (@CricCrazyJohns) November 12, 2023
నెదర్లాండ్స్‌పై భారత బ్యాటర్లు బాదడంతో భారత్ 410 పరగుల భారీ స్కోరు చేసింది. ప్రపంచకప్‌లో ఇది ఐదో అత్యధిక స్కోరు. అంతకుముందు సౌతాఫ్రికా శ్రీలంకపై ఇదే వరల్డ్‌కప్‌లో 428 పరుగుల భారీ స్కోరు చేసింది. 2015లో ఆసీస్.. అఫ్గాన్‌పై 417 పరుగులు చేయగా 2007లో భారత్.. బెర్ముడాపై 413 రన్స్ చేసింది. 2015లో సౌతాఫ్రికా.. ఐర్లాండ్ పై 411 రన్స్ చేయగా ఐదో స్థానంలో నేటి మ్యాచ్ ఉంది.
వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లలో రాహుల్ రెండోవాడు. అంతకుముందు 1999లో రాహుల్ ద్రావిడ్ శ్రీలంకపై 145 పరుగులు చేశాడు.
భారత బ్యాటర్ల బాదుడుతో నెదర్లాండ్స్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆ జట్టులో ఏకంగా ముగ్గురు బౌలర్లు 80కి పైగా పరుగులిచ్చుకున్నారు. వాన్ బీక్ 10 ఓవర్లు వేసి 107 పరుగులివ్వగా.. వాన్ మీకెరన్ పది ఓవర్లలో 90 రన్స్ ఇచ్చాడు. బస్ డీ లీడ్ పది ఓవర్లు వేసి 82 రన్స్ సమర్పించుకున్నాడు. ఇలా ఒక వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు బౌలర్లు 80 ప్లస్ పరుగులిచ్చుకోవడం ఇది నాలుగోసారి. గతంలో శ్రీలంక (సౌతాఫ్రికాపై), అఫ్గానిస్తాన్ (ఆస్ట్రేలియాపై), పాకిస్తాన్ (న్యూజిలాండ్‌పై) జట్లకు చెందిన ముగ్గురు బౌలర్లు (లంకేయులు నలుగురు) 80 ప్లస్ పరుగులిచ్చారు.
నేటి పోరులో కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు నాలుగో వికెట్ కు 208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వరల్డ్ కప్‌లో ఇది కూడా రికార్డే. గతంలో ఈరికార్డు ధోని – రైనాల పేరిట ఉండేది. ఈ ఇద్దరూ మాజీలు 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై 196 పరుగులు జతచేశారు.