Boyalapalli Rekha : అత్యాచారం కేసులో దోషి, హత్య కేసులో నిందితుడైన ‘డేరా బాబా’ అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా(Gurmeet Ram Rahim Singh Baba)కు పెరోల్ ఇవ్వడాన్ని మహిళా కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. దోషిగా తేలిన వ్యక్తికి పదేపదే పెరోల్ మంజూరు చేయడం మహిళల భద్రతకు ప్రమాదకర సంకేతమని తెలంగాణ మహిళా ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయలపల్లి రేఖ (Boyalapalli Rekha) అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నేరస్థులను విడుదల చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆమె ధ్వజమెత్తారు.
ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను 2017లో అత్యాచార కేసులో, 2019లో హత్య కేసులో దోషిగా కోర్టు ప్రకటించింది. న్యాయ సూత్రాల ప్రకారం జీవిత ఖైదు శిక్ష అనుభవించాల్సిన ఆయనకు ఎన్నికల ముందు పెరోలో ఇవ్వడమనేది యాదృచ్ఛికం కాదని మహిళా కాంగ్రెస్ ఆరోపించింది.
అత్యాచార దోషులపై కరుణ చూపడం మహిళల గౌరవం, భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న ఉదాసీనతను బట్టబయలు చేస్తోందని మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ ఉపాధ్యక్షురాలు రేఖ విమర్శించారు. బాధిత మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఓటు లెక్కల కోసం తాకట్టు పెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మోడీని ఆమె హెచ్చరించారు.న్యాయ వ్యవస్థ విలువలకు విరుద్ధంగా రామ్ రహీమ్‌కు ఇచ్చిన ప్రతి పెరోల్ రాజకీయ లబ్ది కోసమేననే అనుమానాలకు బలం చేకూరుస్తోందని మహిళా కాంగ్రెస్ తెలిపింది. ఇలాంటి చర్యలు న్యాయం వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని రేఖ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారతకు, ‘బేటీ బచావో బేటీ పఢావో’కు కట్టుబడి ఉన్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే.. ఆయన పాలనలో అత్యాచార దోషుల దర్జాగా జైలు నుంచి విడుదలవుతున్నారని మహిళా కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలపై జరుగుతున్న నేరాలు, గుర్మీత్ రామ్ రహీం వంటి దోషులకు పెరోల్‌పై మోడీ మౌనం దాల్చడం సమంజసం కాదని రేఖ అన్నారు.
1. రామ్ రహీమ్‌కు మంజూరైన పరోల్లను తక్షణమే రద్దు చేయాలి.
2. నేరస్తులకు రాజకీయ రక్షణ కల్పించిన వారిపై బాధ్యత నిర్ణయించాలి.
3. బాధిత మహిళలకు పూర్తి భద్రత, న్యాయం, గౌరవం కల్పించాలి.
గుర్నీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా బాధిత మహిళలకు న్యాయం జరిగేంత వరకు మహిళా కాంగ్రెస్ అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తుందని బోయలపల్లి రేఖ స్పష్టం చేశారు. జనవరి 5వ తేదీన గుర్మీత్ రామ్ రహీం సింగ్ బాబా 40 రోజుల పెరోల్ మీద విడుదలయ్యారు. 2017లో తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో నిందితుడైన ఆయన ఇలా తాత్కాలికంగా బయటకు రావడం ఇది 15వ సారి.