జనగామ : సీఎం రేవంత్‌రెడ్డిపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్‌రెడ్డి పాలన చేతగాక బీఆర్ఎస్ మీద నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. ఏదో అడ్డిమారి గుడ్డిసూటిల సీఎం అయిన రేవంత్‌రెడ్డి.. మూడేళ్లు టైమ్‌పాస్ చేసిపోక అవాకులు, చెవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి రైతులకు యూరియా ఇయ్య చేతగాదుగానీ.. అబద్ధాలు అనర్గళంగా వస్తయని ఎద్దేవా చేశారు.
‘కేసీఆర్‌ను మల్ల మొలకెత్తనియ్యను’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి శపథం చేయడంపైనా కేటీఆర్ ఫైరయ్యారు. ‘నువ్వేంది కేసీఆర్‌ను మొలకెత్తనియ్యకపోయేది’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లు తెలంగాణను తొక్కిపట్టిందని, తెలంగాణను మొలకెత్తనివ్వమని విర్రవీగిందని, అసుంటి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను మొలిపించిన మొగోడు, మొనగాడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు.
రైతులకు యూరియా ఇవ్వడంలో రేవంత్‌రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. సరిపడా యూరియా అందక రైతులు గోస పడుతున్నరని ఆవేదన వెలిబుచ్చారు. ‘రేవంత్ పాలనలో యూరియా షాప్‌ల లేదు, యాప్‌ల లేదు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్తగా కార్డు అంటూ కొత్త పాట అందుకున్నరని అన్నారు. ‘రైతులకు యూరియా తెలివిలేక నాటకాలాడుతున్న దద్దమ్మలు ఈ కాంగ్రెసోళ్లు’ అని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో రైతులకు సరిపడా ఎరువులు అందాయని, ఎరువుల దుకాణాల ముందు రైతులు లైన్లలో నిలబడాల్సిన అసవరం రాలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతుల సమస్యలు తెలుసని, ఆయన రేవంత్‌రెడ్డిలా రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జనగామలో ఇటీవల గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు.