జనగామ : సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పు ధూళికి కూడా సరితూగడని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం జనగామలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన .. సీఎం రేవంత్రెడ్డిపైన, కాంగ్రెస్ ప్రభుత్వంపైన విమర్శల వర్షం గుప్పించారు.
తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని, అందుకే ఆయన తన తండ్రి అని గర్వంగా చెప్పుకుంటానని కేటీఆర్ అన్నారు. అలాంటి మొనగాడిని సవాలు చేస్తున్న రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన చెప్పు ధూళికి కూడా సరిపోడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెడితెనే రేవంత్ రెడ్డి ఆగమాగం అయితున్నడని, ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అక్కడే గుండె ఆగి సస్తడని అన్నారు.
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిద్దామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతోనే ఓటు వేసి ఆయనను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్క సర్పంచి మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని కోరారు.
వరంగల్ జిల్లాలో సర్పంచులు పెద్ద సంఖ్యలో గెలిచారని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా, ఒత్తిళ్లకు గురిచేసినా పార్టీ కోసం నిలబడ్డారని ప్రశంసించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి ధన్యవాదాలు చెప్పారు. జనగామ ర్యాలీ చూస్తే ‘కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు’ అనిపించిందని అన్నారు.
ప్రజలు గులాబీ జెండాను చూడగానే చప్పట్లు కొడుతుంటే సంతోషం అనిపించిందని, కాళోజీ మాటలు గుర్తొచ్చాయని అన్నారు. కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అయితారా అని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర లేకున్నా అన్ని పదవులు ఇచ్చిన పార్టీని వదిలి కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డితో కలిశాడని విమర్శించారు.
ఇక్కడి నిబద్ధత కలిగిన కార్యకర్తలు బీఆర్ఎస్ బలపర్చిన 150 మంది సర్పంచులను గెలిపించారని మెచ్చుకున్నారు. చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, రాణి రుద్రమదేవి పుట్టిన గడ్డ ఇదని కేటీఆర్ కీర్తించారు.