Mohammed Shami | ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో భారత జట్టు టెస్ట్ కొత్త కెప్టెన్ ఎవరో శనివారం తేలనున్నది. ఇవాళ కొత్త పేరును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా టెస్ట్ సిరీస్ కోసం సెలెక్టర్లు జట్టును ఎంపిక చేసే అవకాశాలున్నాయి. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని ఇంగ్లాండ్ పర్యటన నుంచి తప్పించే అవకాశాలున్నాయి. ఇటీవల ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న షమీని పక్కన పెట్టేందుకే అవకాశాలున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. అతని స్థానంలో అర్ష్‌దీప్ లేదంటే హర్యానాకు చెందిన అన్షుల్ కాంబోజ్‌కు స్థానం కల్పించే అవకాశాలున్నాయి. కాంబోజ్ ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న ఇండియా ఏ జట్టులో చోటు దక్కింది.
వాస్తవానికి, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మహ్మద్ షమీ ఐపీఎల్లో బరిలో దిగాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో షార్ట్ స్పెల్స్, గరిష్టంగా పది ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో టెస్ట్ మ్యాచ్‌లో షమీ పూర్తిస్థాయి శక్తి మేరకు ఎక్కువగా ఓవర్లు బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా లేడని బీసీసీఐ వైద్య బృందం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి తెలిపినట్లు నివేదిక తెలిపింది. ఈ పరిస్థితుల్లో షమీని ఎంపిక చేయడం కష్టంగానే కనిపిస్తున్నది. ఐపీఎల్లో షమీ పెద్దగా రాణించలేకపోయాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచులు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు. 11.23 ఎకానమీ రేట్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున షమీ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తున్నా.. ఒక రోజులో పది ఓవర్ల కంటే ఎక్కువగా బౌలింగ్ చేయగలడో.. లేదో బోర్డు, సెలెక్టర్లకు తెలియదు. ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ మ్యాచుల్లో ఫాస్ట్ బౌలర్ల నుంచి లాంగ్ స్పెల్స్ అవసరం ఉంటుంది. ఎలాంటి సమయంలో రిస్క్ తీసుకోలేమని బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక తెలిపింది. ఈ సిరీస్‌లో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం లభించవచ్చని నివేదిక పేర్కొంది. 22 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 74 వికెట్లు తీసిన హర్యానాకు చెందిన కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ కూడా షమీ స్థానంలో జట్టులోకి అవకాశాలున్నాయి. కాంబోజ్ ఇప్పటికే ఇండియా-ఏ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. కాంబోజ్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నది.
ముంబయిలో శనివారం జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశం కానున్నది. ఆ తర్వాత కొత్త కెప్టెన్ పేరుతో పాటు జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి. కెప్టెన్ రేసులో శుభ్‌మన్ గిల్ ముందంజలో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ సైతం పోటీపడుతున్నారు. ఇంగ్లాండ్ టూర్‌కు ఎంపిక ఆటగాళ్లలో ఎక్కువ మంది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన జట్టులోని సభ్యులే ఉండే అవకాశం ఉంది. కొత్తగా రెండు మూడు కొత్త ముఖాలు కనిపించే అవకాశాలున్నాయి. అర్ష్‌దీప్, కాంబోజ్ కాకుండా సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ పిలుపు అందుకునే అవకాశం ఉంది. రంజీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌ల్లో నాయర్ 863 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో, విజయ్ హజారే ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్‌ల్లో 779 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి.
శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షిత్‌రాణా, శార్దుల్ ఠాకూర్/ అన్షుల్ కాంబోజ్, కుల్దీప్ యాదవ్.