IND vs ENG | భారత్-ఇంగ్లండ్ మధ్య చివరిదైన టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపొందాలంటే ఇంకా 324 పరుగులు చేయాలి. అయితే, సిరీస్‌లో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి విశ్రాంతి లేకుండా ఈ ఫాస్ట్ బౌలర్ వరుసగా ఐదు టెస్టు మ్యాచులు ఆడాడు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో వికెట్లు తీస్తూ ఆదుకుంటూ వస్తున్నాడు. సిరాజ్ ప్రస్తుతం సిరీస్‌లో అత్యధికంగా 19 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లలో దాదాపు 160 ఓవర్లు బౌలింగ్ వేసి ఆకట్టుకున్నాడు. అయితే, వరుస మ్యాచుల నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని అనిపించిందా? అని సిరాజ్‌ను ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నేను విశ్రాంతి గురించి ఆలోచించను. ఎప్పుడూ మ్యాచ్ గురించి మాత్రమే ఆలోచిస్తాను. దేశం కోసం ఆడటాన్ని నేను ఇష్టపడతాను. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని నేను కోరుకుంటాను. ప్రణాళిక రూపొందించుకొని వాటిని అమలు చేస్తేనే ఫలితాలు వస్తాయి’ తెలిపాడు. ప్రస్తుతం టీమిండియాలో పనిభారం అంశం చర్చనీయాంశంగా మారింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు టీమ్ మేనేజ్మెంట్ ఐదు టెస్టుకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఐదు మ్యాచుల్లో మూడు మ్యాచులకు అందుబాటులో ఉంటాడని సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ సైతం తెలిపాడు.
బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ బౌలింగ్ భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. తాను బాధ్యతలు తీసుకునేందుకు ఇష్టపడతానని సిరాజ్ తెలిపాడు. తనకు బాధ్యతలు అంటే ఇష్టమని.. తాను జస్సీ బాయ్‌ని మిస్ అవుతున్నానని, తనకు అతను సీనియర్ బౌలర్ అని తెలిపాడు. వేర్వేరు బ్యాట్స్మెన్లకు ఎలా బౌలింగ్ చేయాలో చూపిస్తాడని.. జస్సీ బాయ్ లేకపోతే అదనపు బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.. కానీ తాను అదనపు ఒత్తిడి తీసుకోకుండా అన్ని విషయాలను సులభంగా ఉంచేందుకు ప్రయత్నిస్తానని సిరాజ్ చెప్పుకొచ్చాడు. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 16.2 ఓవర్లు వేసి 86 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. ఓలీ పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్లు వేసి 15 పరుగులకు ఓ వికెట్ తీశాడు.