IND Vs AUS Playing 11 | బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్టు జరుగనున్నది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా ఎలాగైనా ఈ టెస్టును సైతం గెలిచి ట్రోఫీని ఎగరేసుకుపోవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇక టీమిండియా సిడ్నీలో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌ను సమం చేసి పరువు కాపాడుకోవాలని ప్రయత్నంలో ఉన్నది. చివరి టెస్టులో టీమిండియా పలు కీలక మార్పులు చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. రేపటి టెస్టులో తుది జట్టులో రోహిత్ ఉంటాడా? లేదా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా.. దాటవేయడం ఆ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చినట్లయ్యింది. బోర్డర్ – గవాస్కర్ టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్‌లో టీమిండియా రెగ్యుల్ కెప్టెన్ లేకుండానే బరిలోకి దిగుతుందా..? నిజంగానే ఆ సాహసం చేస్తుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనున్నది.
రోహిత్ గతకొంతకాలంగా పరుగులు సాధించడంలో విఫలమవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో చివరి టెస్టులో చోటు దక్కుతుందా? పక్కన పెడుతారా? అన్న చర్చ సాగుతుంది. హెడ్‌కోచ్ గంభీర్ ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. రోహిత్‌ని టీమ్ మేనేజ్మెంట్ పక్కనపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సిడ్నీ టెస్టుకు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన్న హెడ్ కోచ్ గంభీర్‌ను ప్లేయింగ్-11లో రోహిత్ పేరు ఉంటుందా? అని ప్రశ్నించగా.. క్లారిటీ ఇవ్వలేదు. తుది జట్టును మ్యాచ్‌కు ముందు పిచ్‌ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. సిరీస్‌లో రోహిత్ పేలవ ఫామ్ భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. గత మూడు సిరీస్‌లో 15 ఇన్నింగ్స్‌ల్లో 10.93 సగటుతో 164 పరుగులు మాత్రమే హిట్‌మ్యాచ్ చేయగలిగాడు. ఈ మూడు సిరీస్‌లో రెండు భారత్‌లోనే జరిగాయి. రోహిత్ కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రయే చేయగలిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో కేవలం 31 పరుగులు చేశాడు. ప్రెస్‌మీట్ అనంతరం గంభీర్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు చేరుకొని ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ప్రాక్టీస్ సమయంలో రోహిత్ స్లిప్‌లో లేకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. తొలి స్లిప్‌లో కోహ్లీ, రెండో స్లిప్‌లో కేఎల్ రాహుల్, మూడో స్లిప్‌లో నితీశ్ రెడ్డి ఉన్నారు. ఇక పంత్ వికెట్ కీపింగ్ చేయగా.. యశస్వీ జైస్వాల్ గల్లీలో ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు.
టీమిండియా రోహిత్‌ను పక్కనపెట్టాలని నిర్ణయిస్తే.. శుభ్‌మన్ గిల్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. దాంతో కేఎల్ రాహుల్‌తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు అవకాశం ఉంది. ప్రాక్టీస్ సెషన్లో కోచ్ గంభీర్‌తో గిల్ ముచ్చటిస్తూ కనిపించాడు. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో గిల్ విశ్రాంతి ఇచ్చి రోహిత్ ఓపెనింగ్స్‌కు వచ్చిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టులో బెంచ్‌కే పరిమితమైన గిల్.. సిడ్నీ టెస్టు సందర్భంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. రోహిత్ ఓపెనర్‌గా వచ్చేందుకు గిల్ తన స్థానాన్ని త్యాగం చేయగా.. చివరి టెస్టుకు సైతం రోహిత్ అదే తరహాలో త్యాగం చేస్తాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. రోహిత్ ఈ టెస్టుకు దూరమైతే.. పెర్త్ టెస్టులో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మిస్టరీ ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకే కెప్టెన్సీ పగ్గాలు అందించే అవకాశాలున్నాయి. సిడ్నీలో టెస్టులో తప్పనిసరిగా విజయం సాధించడం టీమిండియాకు కీలకం. ఈ మ్యాచ్‌ను గెలిస్తేనే సిరీస్‌ను 2-2తో సమం చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ (WTC) ఫైనల్‌కు చేరుకునేందుకు టీమిండియాకు అవకాశాలుంటాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగే రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఫలితంపై కూడా భారత్ ఆధారపడాల్సిందే.
ఆస్ట్రేలియా టూర్లో రోహిత్‌తో పాటు ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు రిషబ్ పంత్. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పర్యటనలో రిషబ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో టీమ్ మేనేజ్మెంట్ ఆందోళన మరింత పెరిగింది. జట్టు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో ఉన్న సమయంలో ఆచితూడి ఆడుతూ జట్టును గట్టెక్కించాల్సింది పోయింది.. బాధ్యతారహితమైన షాట్లు ఆడుతూ వికెట్ కోల్పోవడంపై అటు మాజీలతో పాటు.. అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత టెస్టులో రిషబ్ పంత్ షాట్ ఎంపికపై తీవ్రంగానే విమర్శించారు. ప్రస్తుత పర్యటనలో పంత్ 22 సగటుతో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 154 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. అయితే, టీమ్ మేనేజ్మెంట్ పంత్‌ని పక్కనే పెట్టే విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అయితే, పంత్‌ను పక్కన పెడితే.. ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ పర్యటనలో ధ్రువ్ కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. పెర్త్ టెస్టులో ఆడే అవకాశం లభించగా.. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 12 పరుగులు మాత్రమే చేశాడు.
సిడ్నీ టెస్టులకు ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ దూరమయ్యాడు. ఐదో టెస్టుకు ఆకాశ్ దీప్ అందుబాటులో ఉండడం లేదని హెడ్‌కోచ్ గంభీర్ ధ్రువీకరించాడు. ఈ క్రమంలో బుమ్రా, మహ్మద్ సిరాజ్‌పై బౌలింగ్ భారపడనున్నది. దాంతో ఆకాశ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాల మధ్య పోటీ నెలకొంది. ప్రసిద్ధ్ కృష్ణ కంటే హర్షిత్ రాణాకే తుదిజట్టులో చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లోయర్ ఆర్డర్లో బ్యాట్‌తోనూ రాణించే సత్తా ఉంది. ఈ క్రమంలో అతని వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉన్నది.
సిడ్నీ టెస్టుకు భారత జట్టు (అంచనా) : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ/శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా ప్లేయింగ్-11 : సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
IND Vs AUS | టీమిండియాకు షాక్.. సిడ్నీ టెస్టుకు ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ దూరం..!
Gautam Gambhir | డ్రెసింగ్ రూమ్‌లో లుకలుకలు..! కీలక వ్యాఖ్యలు చేసిన హెడ్‌కోచ్ గంభీర్..!