Sydney Test | సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగనున్న ఐదో టెస్టుకు ఆస్ట్రేలియా జుట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను పక్కనపెట్టినట్లు కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. అతనిస్థానంలో బ్యూ వెబ్‌స్టర్‌కు తుదిజట్టులో చోటు కల్పించినట్లు పేర్కొన్నాడు. మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో పాట్ కమిన్స్ మాట్లాడాడు. ప్రస్తుతం సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉన్న ఆస్ట్రేలియా 2014 తర్వాత తొలిసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకోవాలన్న కసితో ఉన్నది.
బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో మిచెల్ మార్ష్ బ్యాట్‌తో సత్తాచాటలేకపోయాడు. నాలుగు టెస్టు మ్యాచుల్లో ఇన్నింగ్స్‌కు 10.42 సగటుతో కేవలం 73 పరుగులు చేయగలిగాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. అదే సమయంలో బంతితోనూ మ్యాజిక్ చేయలేకపోయాడు. దాంతో సిడ్నీ టెస్ట్‌కు దూరం పెట్టాలని సెలెక్టర్లు నిర్ణయించారు. మార్ష్ స్థానంలో జట్టులోకి వచ్చిన వెబ్‌స్టర్ ఆస్ట్రేలియా తరఫున టెస్టు ఆడుతున్న 469వ ఆటగాడు కావడం విశేషం.
ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఫిట్‌గా ఉన్నాడని, భారత్‌తో జరిగే చివరి టెస్టు మ్యాచ్‌లో ఆడతాడని కమిన్స్ చెప్పాడు. మెల్బోర్న్ టెస్టులో స్టార్క్ వెన్ను సమస్యలతో బాధపడుతున్నట్లుగా కనిపించారు. అయితే, ఈ ఏడాది జరుగనున్న తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడని కెప్టెన్ ధ్రువీకరించాడు. ఈ బౌలర్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం ఆస్ట్రేలియా జట్టుకు ఎంతో ఉపశమనం కలిగించే విషయం. స్టార్క్ ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌లో కీలక పాత్ర పోషిస్తాడని జట్టు భావిస్తున్నది. అందుబాటులో లేకపోతే బౌలింగ్ విషయంలో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది.
సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో వెబ్‌స్టర్‌కు ఆస్ట్రేలియా సిడ్నీ టెస్ట్‌లో ఆడే అవకాశం కల్పించింది. ఇప్పటికే వెబ్‌స్టర్ దేశీయ సర్క్యూట్లో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కమిన్స్ మాట్లాడుతూ మిచెల్ మార్ష్ పరుగులు చేయలేకపోవడంతో.. ఈ సిరీస్‌లో వికెట్‌ను కాపాడుకోవడంలో విఫలమైనందున.. కొత్త ఆటగాడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు కెప్టెన్ తెలిపాడు. అతని స్థానంలో వెబ్‌స్టర్ ఎంపిక ఉత్తమంగా ఉంటుందని.. అతనికి అవకాశం ఇవ్వడం సరైందేనని భావిస్తున్నామన్నారు. అయితే, ఇది మిచెల్ మార్ష్‌కు అవమానకరమైన విషయమే! ఎందుకంటే గతంలో అతను జట్టుకు ఎంతో సహకారం అందించాడు.
సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.