IND Vs AUS | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టుకు భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ దూరమయ్యాడు. వెన్ను సమస్యతో బాధపడుతున్నాడని.. ఈ క్రమంలో సిడ్నీ టెస్టుకు అందుబాటులో ఉండడని మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు. ఇప్పటికే సిరీస్‌లో 1-2తో వెనుకబడిన భారత జట్టుకు ఆకాశ్ దీప్ లేకపోవడం ఓ రకంగా షాక్‌లాంటిదే.
ఆకాశ్ దీప్ గత రెండు టెస్టు మ్యాచుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, ఫీల్డింగ్ మాత్రం చెప్పుకోదగ్గ విధంగా లేదు. కీలకమైన క్యాచ్‌లను జారవిడిచాడు. బ్రిస్బేన్ టెస్ట్‌లో జప్రీత్ బుమ్రాతో కలిసి ఆకాశ్ దీప్ చివరి వికెట్‌కు కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో టీమిండియా ఫాలో-ఆన్ గండం నుంచి బయటపడింది. ఈ క్రమంలో వెన్ను సమస్య కారణంగా ఆకాశ్ దీప్ సిడ్నీ టెస్టుకు దూరం కావడం కాస్త ఇబ్బందికరమే.
ఇప్పటికే సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా.. ఎలాగైనా చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్నది. ఈ క్రమంలో సిడ్నీ టెస్టుకు తుదిజట్టులో ఎవరికి చోటు కల్పిస్తారనే చర్చ సాగుతుంది. అయితే, ప్లేయింగ్-11పై గంభీర్ కీలక విషయాలు వెల్లడించారు. పిచ్‌ను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే, ఆకాశ్ దీప్‌ను పక్కనపెట్టడం టీమిండియాకు ఇబ్బందికరమే. గత రెండు డెస్టుల్లో 87.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బౌలింగ్ భారం కారణంగా వెన్ను నొప్పి బారినపడ్డాడు. ఆస్ట్రేలియాలోని మైదానాలు ఫాస్ట్ బౌలర్లకు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. మోకాలు, చీలమండ, వెన్ను సమస్యల బారినపడుతుంటారు. ఆకాశ్ దీప్ గైర్హాజరీలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలో ఎవరో ఒకరికి స్థానం దక్కే అవకాశం ఉంది.