IND Vs AUS | ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా చెత్త ప్రదర్శన కొనసాగుతున్నది. శుక్రవారం మొదలైన సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరోసారి విఫలమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 185 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా 72.2 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. 40 పరుగులతో రిషబ్ పంత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అయినా, టీమిండియా బ్యాటింగ్‌లో పెద్ద తేడా మాత్రం కనిపించలేదు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో చివరిదైన ఐదో టెస్ట్ తొలిరోజు ఆట ముగిసింది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగింది. ఆతిథ్య జట్టు స్టంప్స్‌కు ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. తొలిరోజు ఆట చివరి బంతినికి ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (2రన్స్) అవుట్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచి ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 176 పరుగులు వెనుకంజలో ఉన్నది. ప్రస్తుతం సామ్ కాన్స్టాస్ నాటౌట్‌గా ఉన్నాడు.
టీమిండియా ఓ చెత్త రికార్డు సృష్టించింది. 2024 నుంచి అత్యధిక సార్లు టెస్టుల్లో 80 ఓవర్లలోపు ఆలౌట్ అయిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు టీమిండియా 14 సార్లు టెస్టుల్లో 80 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేకపోయింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉన్నది. ఇంతకు ఈ రికార్డు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పేరిట ఉండేది. ఆయా జట్లు 13సార్లు.. 80 ఓవర్లు ఆడకుండానే ఆలౌట్ అయ్యాయి. ప్రస్తుతం టీమిండియా.. ఆయా దేశాలను అధిగమించాయి.
సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 200 పరుగులు చేయడంలో విఫలమైంది. ఇంతకుముందు 2000లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకే కుప్పకూలింది. అయితే, 2012లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో 191 పరుగులు మాత్రమే చేసింది. తాజాగా మరోసారి టీమిండియా 185 పరుగులకు ఆలౌట్ అయ్యింది.