IND vs AUS | బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య మూడో టెస్టు రెండో రోజు నిరాటంకంగా కొనసాగుతోంది. తొలి రోజు వరుణుడు ఆటంకం కలిగించినప్పటికీ.. రెండో రోజు సాఫీగా మ్యాచ్ కొనసాగుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.
ఓవర్‌నైట్ స్కోర్ 28/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియాను తొలినుంచే టీమిండియా కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్‌లో ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజ(21), నాథన్ మెక్‌స్వీని(9)ను పెవిలియన్‌కు పంపించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, లబుషేన్ నిలకడగా ఆడటం మొదలుపెట్టారు. అయితే 75 పరుగుల వద్ద నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి లబుషేన్ (12) ఔటయ్యాడు. దీంతో రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్ (20), స్టీవ్ స్మిత్ (25) ఉన్నారు.
శనివారం మొదలైన టెస్టు తొలి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కల్గించాడు. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మబ్బులు కమ్ముకున్న వాతావరణాన్ని అంచనా వేస్తూ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తేమతో కూడిన పిచ్‌పై టీమ్ఇండియా బౌలర్లను ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజ(19 నాటౌట్), నాథన్ మెక్‌స్వీని(4 నాటౌట్) చాకచక్యంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టార్ పేసర్ బుమ్రా స్పెల్‌ను జాగ్రత్తగా ఆడారు. ఏ మాత్రం తొందరపాటు కనబర్చకుండా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించారు.
తొలి సెషన్లో ఒకింత తెరిపినివ్వడంతో 25 నిమిషాల వ్యవధిలో ఆసీస్ వికెట్ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా వాన రావడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. బుమ్రాను జాగ్రత్తగా ఆడిన ఖవాజ, మెక్‌స్వీని..సిరాజ్, ఆకాశ్‌దీప్‌ను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీలు కొట్టారు. టెస్టులో మిగిలిన నాలుగు రోజులకు కూడా వర్షం అంతరాయం కల్గించనుందన్న వార్తల నేపథ్యంలో మూడో టెస్టుపై ఆసక్తి నెలకొన్నది.