కౌలాలంపూర్: మలేషియాలో జరిగిన రెండో ఏషియన్ స్కాష్ డబుల్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ అదరగొట్టింది. మూడింటికి మూడు విభాగాల్లోనూ స్వర్ణాలు గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం జరిగిన ఫైనల్స్ పోటీలలో పురుషుల, మహిళల, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత ఆటగాళ్లు ప్రత్యర్థులను చిత్తుచేసి పసిడి ప్రదర్శనలు నమోదుచేశారు. పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్ ద్వయం అభయ్ సింగ్-వెలవన్ సెంథిల్‌కుమార్.. 2-1 (9-11, 11-5, 11-5)తో పాకిస్థాన్ జోడీ నూర్ జమన్-నాసిర్ ఇక్బాల్‌ను ఓడించింది.
తొలి సెట్ కోల్పోయినప్పటికీ తర్వాత పుంజుకున్న భారత జోడీ.. వరుస సెట్లతో పాక్ ఆటగాళ్లను చిత్తుచేసింది. ఆ తర్వాత జరిగిన మహిళల డబుల్స్‌లో సీనియర్ ప్లేయర్ జ్యోత్స్న చిన్నప్ప.. 17 ఏండ్ల అమ్మాయి అన్హత్ సింగ్‌తో కలిసి 2-1 (8-11, 11-9, 11-10)తో అమని-జిన్ యింగ్ (మలేషియా) ద్వయాన్ని మట్టికరిపించింది. 35 నిమిషాల్లోనే ఈ పోరు ముగిసింది. ఇక చివరగా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో అభయ్-అన్హత్ జంట.. 2-0 (11-9, 11-7)తో రేచల్ ఆర్నాల్డ్-అమీషెన్రాజ్ చందరన్ (మలేషియా)పై అలవోక విజయం సాధించారు. అభయ్, అన్హత్ రెండు విభాగాల్లో (పురుషుల, మహిళల డబుల్స్‌లో)నూ స్వర్ణాలు సాధించడం గమనార్హం.