దుబాయ్: గతేడాదికి గాను ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టు (ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఈయర్-2024)లో భారత్ నుంచి ముగ్గురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌కు స్థానం లభించింది. ఆసీస్ సారథి పాట్ కమిన్స్‌ను సారథిగా ప్రకటించిన ఐసీసీ.. ఇంగ్లండ్ నుంచి నలుగురు క్రికెటర్ల( జో రూట్, హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్, బెన్ డకెట్)ను ఎంపిక చేసింది.
వన్డే జట్టులో భారత్ నుంచి ఒక్క క్రికెటర్ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. గతేడాది భారత్ లంకతో మూడు వన్డేలు మాత్రమే ఆడటమే ఇందుకు కారణం. శ్రీలంక కెప్టెన్ చరిత అసలంకతో పాటు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌కు చెందిన పది మంది క్రికెటర్లు వన్డే జట్టులో చోటు సంపాదించారు. మహిళల విభాగంలో ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఈయర్’ జాబితాలో టీమ్ఇండియా నుంచి స్మృతి మంధాన, దీప్తి శర్మ ఎంపికయ్యారు.