ICC Test Ranking | ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోమిత్ శర్మ టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) బుధవారం టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. సెప్టెంబర్ 2021 తర్వాత తొలిసారి రోహిత్ టాప్-5లోకి చేరుకున్నాడు. టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ర్యాంకులు సైతం మెరుగయ్యాయి. జైస్వాల్ ఆరు, విరాట్ ఏడో ప్లేస్‌లో నిలిచారు. టీమిండియా త్వరలో బంగ్లాదేశ్‌లో టెస్ట్ సిరీస్ ఆడనున్నది. ఈ సిరీస్‌లో ఆటగాళ్లు రాణిస్తే ర్యాంకులు మరింత మెరుగయ్యే ఛాన్స్ ఉన్నది.
ఈ ఏడాది ఇంగ్లండ్‌తో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బ్యాట్‌తో రాణించారు. ఇద్దరు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. యువ బ్యాటర్ జైస్వాల్ ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు చేసి.. మొత్తం 712 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ సైతం రెండు సెంచరీలతో రాణించి 400 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ శ్రీలంక బ్యాటర్లు మెరుగైన ర్యాంకులకు చేరారు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఓలీ పోప్ నేతృత్వంలోని జట్టును ఓడించిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, శ్రీలంకతో జరిగిన మూడో, చివరి టెస్ట్‌లో రెండుసార్లు విఫలం కావడంతో రేటింగ్ తగ్గింది. స్కోర్ 922 పాయింట్ల నుంచి 899 పాయింట్లకు పడిపోయింది. న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ 859 రేటింగ్ పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. మూడోస్థానంలో న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచేల్, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ కొనసాగుతున్నారు. టాప్ 10లో పాక్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.