దుబాయ్: ఆసియా కప్‌లో ఆదివారం భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు ఆటగాళ్లు తమకు హ్యాండ్‌షేక్ ఇవ్వలేదని, దీనికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను బాధ్యుడిగా చేస్తూ అతడిని తొలగించాలని ఐసీసీ గడపతొక్కిన పాకిస్థాన్‌కు భంగపాటు తప్పలేదు. పైక్రాఫ్ట్‌ను తొలగించేది లేదని ఐసీసీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి సోమవారం రాత్రి లేఖ రాసినట్టు ఐసీసీ వర్గాలు తెలిపాయి.
ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఉన్న పైక్రాఫ్ట్‌కు 695 మ్యాచ్‌లలో (మూడు ఫార్మాట్లలో కలిపి) రిఫరీగా పనిచేసిన అనుభవముంది. పైక్రాఫ్ట్‌ను తొలగించకుంటే ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని పీసీబీ బెదిరించినట్టు వార్తలు వచ్చినా ఐసీసీ తాజా లేఖతో ఆ జట్టు వెనక్కి తగ్గింది. బుధవారం పాక్ యూఏఈతో మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే భారత్ చేతిలో ఓడిన దాయాదికి యూఏఈతో ఓడితే సూపర్-4 బెర్తు ఆశలు ఆవిరవుతాయి.