దుబాయ్ : ఈనెల 19 నుంచి ప్రారంభం కాబోయే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ఐసీసీ ప్రైజ్‌మనీని ప్రకటించింది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీని 6.9 యూఎస్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 60 కోట్లు)గా ప్రకటించిన ఐసీసీ.. ఫైనల్లో కప్పు గెలిచిన విజేతకు 2.24 యూఎస్ మిలియన్ డాలర్లు (రూ. 20.8 కోట్లు) అందించనుంది. గత ఎడిషన్‌తో పోలిస్తే ఇది 53 శాతం అధికం. ఇక రన్నరప్‌గా నిలిచే జట్టుకు 1.12 యూఎస్ మిలియన్ డాలర్లు (రూ. 9.72 కోట్లు) దక్కనున్నాయి. ఈ మేరకు ఐసీసీ చైర్మన్ జై షా శుక్రవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించాడు. సెమీస్‌లో ఓడిన జట్లకు రూ. 4.86 కోట్లు.. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచే జట్లకు రూ. 3 కోట్లు దక్కుతాయి. 7,8 స్థానాల్లో నిలిచే జట్లకు తలా రూ. 1.2 కోట్లు అందుతాయి. దీంతో పాటు చాంపియన్స్ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించినందుకు గాను ఒక్కో జట్టుకు అదనంగా రూ. 1.08 కోట్ల నగదు బహుమానం దక్కుతుందని ఐసీసీ తెలిపింది. 1996 తర్వాత తొలిసారి ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్.. ఈ టోర్నీని ఏ మేరకు విజయవంతంగా నిర్వహిస్తుందనేది క్రికెట్ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.