ODI Matches | నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు, మూడు గంటల్లోనే ముగిసే ధనాధన్ టీ20లకు మధ్య వన్డేల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న వేళ పాకిస్థాన్‌లో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. ఈ ఫార్మాట్‌కు ఓ దారిదీపంగా మారుతుందని భావించారంతా! టెస్టుల తర్వాత క్రికెట్లోని అసలు మజాను పంచడంలో వన్డేలకు ఉండే క్రేజే వేరు. సచిన్, గంగూలీ, స్టీవ్ వా, పాంటింగ్, సంగక్కర, కలిస్ వంటి నాటితరం క్రికెటర్లు మొదలుకుని నేడు దిగ్గజాలుగా వెలుగొందుతున్న కోహ్లీ, రోహిత్, విలియమ్సన్, స్మిత్ ఈ ఫార్మాట్ ద్వారానే ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నారు. కానీ చాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్‌లు జరుగుతున్న స్టేడియాలలో చూస్తే మాత్రం స్టార్ల మీద అభిమానం కాదు కదా! తమ దేశం ఆడుతున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
కరాచీలో జరిగిన రెండు మ్యాచ్‌లతో పాటు దుబాయ్‌లో భారత్, బంగ్లా మ్యాచ్‌కు స్టేడియాలు ఖాళీగా దర్శనమివ్వడమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మూడు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ట్రోఫీని చూసేందుకు జనం వెల్లువెత్తుతారని, ప్రపంచంలో ఎక్కడా లేని ఆతిథ్యం తమ దేశంలో ఇస్తామని పాకిస్థాన్ తాజా, మాజీ క్రికెటర్లు బీరాలు పలికారు. కానీ స్వయానా తమ దేశం ఆడిన టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్ (న్యూజిలాండ్‌తో)ను చూసేందుకు పాకిస్థానీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ మొదలైనప్పుడు స్టేడియంలో అక్కడొకరు ఇక్కడొకరు విసిరేసినట్టుగా కనిపించారు.
పోనీ సాయంత్రం పాక్ బ్యాటింగ్ సమయంలో అయినా స్టాండ్లు నిండుతాయేమో అని భావించినా అప్పటికీ అదే పరిస్థితి. దీనిపై ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ స్పందిస్తూ.. ‘1996 తర్వాత పాక్ మేజర్ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తుండటం సంతోషం. కానీ జనం ఏరి? వాళ్లు (పీసీబీ) స్థానిక ప్రజలకు టోర్నీ గురించి చెప్పడం మరిచిపోయారా?’ అని చురకలు అంటించాడు. ఇక కొంతమంది ఎక్స్ యూజర్లు అయితే ‘మొన్న ఢిల్లీలో విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్‌ను చూసేందుకు ఇంతకంటే ఎక్కువ జనం వచ్చారు’ అని కామెంట్స్ చేశారు.
ప్రత్యర్థి ఎవరైనా భారత్ ఆడుతుంటే ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియాలకు పోటెత్తే ప్రేక్షకులు.. దుబాయ్ స్టేడియం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సుమారు 30వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న దుబాయ్‌లో బంగ్లా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గట్టిగా 2 వేల మంది కూడా కనబడలేదు. ఇది చూసిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ స్పందిస్తూ.. ‘భారత్, బంగ్లా మ్యాచ్ చూస్తున్నా. స్టాండ్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. వన్డే ఫార్మాట్ క్రికెట్ అభిమానులకు బోర్ కొట్టేసిందా? వన్డేలను రద్దు చేసి టెస్టులకు ప్రాధాన్యం పెంచాలా?’ అని ట్వీట్ చేశాడు. భారత్ బ్యాటింగ్ చేసేప్పుడు కూడా సగాని కంటే ఎక్కువ స్టేడియం ఖాళీగానే కనిపించింది.
దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ మ్యాచ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఈ నేపథ్యంలో వన్డేలను 40 ఓవర్లకు కుదించాలని, జనాన్ని ఆకర్షించే విధంగా ఈ ఫార్మాట్లో మార్పులు చేయాలని గతంలో రవిశాస్త్రి వంటి మాజీలు ఐసీసీకి సూచించిన విషయాన్ని ఫ్యాన్స్ ప్రస్తావిస్తున్నారు. చాలా దేశాలు ధనార్జనలో పడి టీ20 లీగ్‌లకే ప్రాధాన్యమిస్తూ వన్డేలను విస్మరిస్తున్నాయి. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ ముందు వరకూ భారత్ ఆడిన వన్డేలు 9 మాత్రమే కావడం గమనార్హం.