రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు విసురుతున్న యంగ్‌స్టర్ ఒక వైపు.. సీజన్లోనే అత్యంత వేగవంతమైన (153.9 కి.మీ) బాల్ వేసి అబ్బుర పరిచిన పేసర్ మరోవైపు! ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గి పాయింట్ల పట్టిక టాప్‌లో ఉన్న జట్టు ఒకటైతే.. అజేయంగా సాగుతున్న జట్టుకు ఓటమి రుచి చూపించిన టీమ్ మరొకటి!
బ్యాటింగ్, బౌలింగ్ సమతూకానికి సారథ్య పదును జోడిస్తున్న కెప్టెన్ ఒకరైతే.. అనామక ఆటగాళ్ల నుంచే అద్భుత ప్రదర్శన రాబడుతున్న ప్రపంచ స్థాయి నాయకుడు మరొకరు!
బౌలర్స్పైనే భారం..
తమపై ఉన్న ముద్రకు తగ్గట్లు బౌలింగ్‌లో చెలరేగిపోతున్న సన్‌రైజర్స్.. లీగ్‌లో తొలి రెండు పరాజయాల తర్వాత ఉత్తుంగ తరంగంలా ఎగసింది. బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేస్తుండగా.. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, విలియమ్సన్తో కూడిన టాపార్డర్ నిలకడ కనబరుస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు లీగ్‌లో రైజర్స్‌కు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. తాజా సీజన్లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ నెగ్గి జోష్‌లో ఉన్న సమయంలో వారికి తొలి పరాజయాన్ని రుచి చూపించిన ఘనత కూడా హైదరాబాద్‌కే దక్కుతుంది. ఈ రెండో జట్ల మధ్య ఈ నెల 11న జరిగిన పోరులో విలియమ్సన్ సేన విజృంభించింది. గాయంతో గత మ్యాచ్‌లకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ పోరులో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే.. సుచిత్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా గత మ్యాచ్‌ల్లో ఆడిన జట్టుతోనే రైజర్స్ బరిలోకి దిగనుంది.
ఆల్‌రౌండర్ల అండతో..
ఐపీఎల్లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్.. అంచనాలకు మించి ఆకట్టుకుంటున్నది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును ముందుండి నడిపిస్తుండగా.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో టీమ్ సమతూకంగా ఉంది. మిడిలార్డర్లో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉండటం టైటాన్స్ బలాన్ని మరింత పెంచుతున్నది. శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా.. ఇప్పటికే మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకోగా.. రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ బ్యాట్‌తో తామెంత ప్రమాదకారులో చాటి చెప్పారు. సీనియర్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా ఫామ్‌లో లేకపోవడం తప్ప గుజరాత్‌కు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. సారథ్య బాధ్యతలు చేపట్టాక మరింత రాటుదేలిన హార్దిక్.. జట్టును నడిపిస్తున్న తీరుపై గవాస్కర్ వంటి మాజీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న ఈ ఆల్‌రౌండర్ గతంలో కంటే ఎక్కువ నిలకడగా ఆడుతూ.. ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలుస్తున్నాడు.
తుది జట్లు (అంచనా)
హైదరాబాద్: విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్, త్రిపాఠి, మార్క్మ్,్ర పూరన్, శశాంక్, సుచిత్/సుందర్, భువనేశ్వర్, జాన్సెన్, ఉమ్రాన్, నటరాజన్.
గుజరాత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), గిల్, సాహా, మిల్లర్, తెవాటియా, మనోహర్, రషీద్, జోసెఫ్, ఫెర్గూసన్, షమీ, యశ్ దయాల్.