సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) ఆఖరి అంచె పోటీలకు హైదరాబాద్ సిద్ధమైంది. నగరం నడిబొడ్డున హుసేన్సాగర్ తీర ప్రాంతంలో రేసింగ్ కార్లు రయ్య్‌మ్రంటూ దూసుకెళ్లనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై వేదికగా మూడు దశల్లో పోటీలను పూర్తి చేసుకున్న ఐఆర్ఎల్ ఫైనల్ రేసు శని, ఆదివారాల్లో అభిమానులను అలరించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను హెచ్ఎండీఏతో పాటు రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లీగ్(ఆర్పీపీఎల్) పర్యవేక్షిస్తున్నది.
తొలి అంచె పోటీల సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ట్రాక్‌లో పలు మార్పులు చేశారు. ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా ఉండేందుకు నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ట్రాక్ మీదుగా రాకపోకలు లేకుండా బయట వైపే వీఐపీలతో పాటు మీడియా, ఇతర ప్రేక్షకులు కూర్చుని వీక్షించేలా గ్యాలరీలను ఏర్పాటు చేశారు.