ముంబై: హైదరాబాద్ క్రికెటర్ అరుంధతి రెడ్డి మరోసారి టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టుకు అరుంధతి ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీచరణి కూడా జట్టులో చోటు దక్కించుకుంది. ఈ మేరకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో 15 మందితో కూడిన జట్టును మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. హైదరాబాదీ అరుంధతి నాలుగోసారి టీ20 ప్రపంచ కప్లోబరిలోకి దిగనుంది. ఇది వరకు 2018, 2020, 2024లోనూ ఈ మెగా టోర్నీలో ఆడింది. మరోవైపు,చండీగఢ్‌కు చెందిన అన్క్యాప్డ్ మీడియం పేసర్ నందిని శర్మని జట్టులోకి తీసుకొని ఆశ్చర్యపరిచిన సెలక్షన్ కమిటీ.. యువ వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియాకు అవకాశం కల్పించింది. తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన నందిని గత డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ లో సత్తా చాటి వెలుగులోకి వచ్చింది.
ఇక స్పెషలిస్ట్ బ్యాటర్లు ప్రతికా రావల్, హర్లీన్ డియోల్‌ను సెలక్షన్ కమిటీ పక్కనబెట్టింది. గాయాల కారణంగా ఆల్ రౌండర్ అమన్‌జోత్ కౌర్, కశ్వీ గౌతమ్ జట్టుకు దూరమయ్యారు. గతేడాది వన్డే ప్రపంచ కప్ అందుకున్న హర్మన్ మరోసారి జట్టుకు నాయకత్వం వహించనుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా కొనసాగనుంది. మొత్తంగా వన్డే ప్రపంచ కప్ నెగ్గిన కోర్ టీమ్‌నే సెలెక్టర్లు కొనసాగించారు. ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ టోర్నీ ఫైనల్ జులై 5న లండన్‌లో జరగనుంది. భారత్ ఇప్పటి వరకూ టీ20 కప్ నెగ్గాలేదు.కాగా, ఇదే జట్టు ప్రపంచకప్ ముంగిట ఇంగ్లండ్ అమ్మాయిలతో మే28 నుంచి జరిగే మూడు టీ20ల సిరీస్‌లో పోటీ పడనుంది. ప్రపంచకప్ తర్వాత ఇంగ్లండ్‌తో (జులై 10-13) జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు కూడా సెలక్టర్లు జట్టును ప్రకటించారు. ఇందులో ప్రతికా రావల్ చోటు దక్కించుకుంది.
టీ20 ప్రపంచ కప్ జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), శ్రీ చరణి, యాస్తిక భాటియా (కీపర్), నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.