హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావుకు ఊరట లభించింది. ఫోర్జరీ కేసులో నెల రోజులకు పైగా రిమాండ్‌లో ఉన్న జగన్మోహన్రావుకు గురువారం హైకోర్టు జస్టిస్ సుజన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్‌తో పాటు ఇద్దరు పూచీకత్తులను ట్రయల్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ప్రతీ సోమవారం ఉదయం 11 గంటలకు సంబంధిత ఎస్‌హెచ్‌వో ముందు 8 వారాల పాటు లేదా చార్జీషీట్ దాఖలు చేసే వరకు దర్యాప్తు అధికారి పిలిస్తే హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు తీర్పులో పేర్కొంది.
బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 480(3) నిబంధనలకు కట్టుబడి ఉండాలని, సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను బెదిరించడం, ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. శ్రీచక్ర క్లబ్ ఫోర్జరీ కేసులో నిర్దిష్టమైన ఆధారాలు చూపడంలో సీఐడీ విఫలమైన నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని జగన్మోహన్రావు వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది.