IPL 2023 : పదహారో సీజన్ ఐపీఎల్లో ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) పుంజుకుంది. ప్లే ఆఫ్ అవకాశాలు మిణుకుమిణుకుమంటున్న వేళ అద్భుత విజయం సాధించింది. గత సీజన్ రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌పై సంచలనం సృష్టించింది. శుభారంభం ఇవ్వడంలో వరుసగా విఫలమవుతున్న మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్‌ను పక్కన పెట్టేయడం కలిసొచ్చింది. దాంతో, హైదరాబాద్ జట్టు కూర్పు కుదరినట్టేనని, ఓపెనింగ్ సమస్య కూడా తీరినట్టేనని అనిపిస్తోంది.
ఓపెనర్లుగా వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ ధనాధన్ ఆడి రాజస్థాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. కీలక పోరులో అభిషేక్ రెండో హాఫ్ సెంచరీతో మెరిశాడు. అంతేకాదు హ్యారీ బ్రూక్ ప్లేస్‌లో వచ్చిన గ్లెన్ ఫిలిఫ్స్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇక ఆఖరి బంతికి అబ్దుల్ సమద్(17 నాటౌట్ ) సిక్స్ కొట్టడంతో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.
WHAT. A. GAME 😱😱
Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets.
Scorecard – https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz
— IndianPremierLeague (@IPL) May 7, 2023
మినీ వేలంలో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కోసం హైదరాబాద్ ఫ్రాంఛైజీ భారీ ధర పెట్టింది. రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతను తమ జట్టుకు విజయాలు అందిస్తాడని అశించింది. కానీ, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సెంచరీ తప్పితే మిగతా మ్యాచుల్లో బ్రూక్ దారుణంగా విఫలమయ్యాడు. 9 మ్యాచుల్లో 20.38 సగటుతో 163 రన్స్ చేశాడంతే. మయాంక్ అగర్వాల్ కూడా అంతంత మాత్రంగా రాణిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 48 రన్స్ అతడి టాప్ స్కోర్.
అన్మోల్ ప్రీత్ సింగ్ – అభిషేక్ శర్మ
దాంతో, వీళ్లను కాదని అభిషేక్‌కు ఛాన్స్ ఇచ్చారు. అతను ఢిల్లీపై, రాజస్థాన్‌పై చెలరేగి ఆడి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాడు. అన్మోల్ ప్రీత్ కూడా పవర్ ప్లేలో దూకుడుగా ఆడాడు. దాంతో, వీళ్లనే ఓపెనర్లుగా పంపే అవకాశం ఉంది. అంతేకాదు ఓవర్సీస్ ప్లేయర్ ఫిలిఫ్స్ రూపంలో జట్టుకు పవర్ హిట్టర్ దొరికాడు. తర్వాతి మ్యాచుల్లో ఇదే జట్టును కొనసాగించాలనుకుంటే బ్రూక్, అగర్వాల్ ఇక బెంచ్‌కే పరిమితం అవుతారు.
సొంత గడ్డపై జోస్ బట్లర్(95), సంజూ శాంసన్(66 నాటౌట్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. దాంతో రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్లు అన్మోల్ ప్రీత్ సింగ్(33), అభిషేక్ శర్మ(55) శుభారంభం ఇచ్చారు. మిడిలార్డర్లో రాహుల్ త్రిపాఠి(47), హెన్రిచ్ క్లాసెన్(27) దంచి కొట్టారు. ఆఖర్లో గ్లెన్ ఫిలిఫ్స్(25) హ్యాట్రిక్ సిక్స్‌లు, ఒక ఫోర్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇక ఆఖరి బంతికి అబ్దుల్ సమద్(17 నాటౌట్ ) సిక్స్ కొట్టడంతో హైదరాబాద్ డగౌట్లో సంబురాలు మొదలయ్యాయి. సొంత గడ్డపై సీజన్ తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్ సేన చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కిందకు తోసేసింది. తదుపరి మ్యాచుల్లో ఇదే విధంగా ఆడితే మరక్రం సేన ప్లే ఆఫ్ చేరే అవకాశాలు లేకపోలేదు.