హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్, ఆంధ్ర జట్ల మధ్య స్థానిక ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరిగిన రంజీ గ్రూపు-బీ పోరు డ్రా గా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన హైదరాబాద్ 51 ఓవర్లలో వికెట్ నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(95) మరోమారు తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.
అభిరాత్రెడ్డి(70 నాటౌట్) అర్ధసెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. రఫీ(1/35)కి ఏకైక వికెట్ దక్కింది. అంతకముందు ఓవర్‌నైట్ స్కోరు 448/9తో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆంధ్ర ఒక్క పరుగు జతచేయకుండానే ఆలౌటైంది. అనికేత్‌రెడ్డి(4/137), రక్షణ్‌రెడ్డి(3/75) ఆకట్టుకున్నారు.
ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఆంధ్రకు 3 పాయింట్లు దక్కగా, హైదరాబాద్ ఒక పాయింట్‌కు పరిమితమైంది. హైదరాబాద్ 9పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నది.