Champions Trophy | కరాచీ: పాకిస్థాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆ దేశంలో జరుగుతుందా? ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. భద్రతా కారణాల రీత్యా దాయాది దేశానికి వెళ్లబోమని, హైబ్రిడ్ మోడల్ అయితేనే ఆడతామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇది వరకే తన నిర్ణయాన్ని స్పష్టం చేయగా మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందుకు ససేమిరా అంగీకరించడం లేదు. టీమ్ఇండియా పాక్‌కు రావాల్సిందేనని పట్టుబడుతోంది. శుక్రవారం జరగాల్సి ఉన్న ఐసీసీ వర్చువల్ సమావేశానికి కొద్దిగంటల ముందు కూడా పీసీబీ అదే మొండి పట్టుదలను ప్రదర్శిస్తూ.. ‘హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించే ప్రసక్తే లేదు. దీనిపై మేం ఇది వరకే ఐసీసీకి మా నిర్ణయాన్ని తేల్చి చెప్పాం’ అని బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలపై జరగాల్సిన చర్చ కాస్తా అసలు ఈ టోర్నీ పాకిస్థాన్‌లో ఉంటుందా? మరో దేశానికి తరలిపోతుందా? అలా చేస్తే పాకిస్థాన్ ఊరుకుంటుందా? భారత్ కోరుకున్నట్టుగా హైబ్రిడ్ మోడల్ సాధ్యమవుతుందా? అన్న అంశాలపై సాగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పాక్‌కు రాబోమని విముఖత వ్యక్తం చేసినా టీమ్ఇండియా తమ దేశానికి రావాల్సిందేనన్న మంకు పట్టుతో ఉన్న పీసీబీకి గత వారం రోజులుగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తలెత్తిన పరిస్థితి కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన పార్టీ మద్దతుదారులు సృష్టిస్తున్న హింసాకాండకు అక్కడ సుమారు ఆరుగురు భద్రతా సిబ్బంది మరణించగా వందలాదిగా జనం గాయాల పాలయ్యారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌ను అష్టదిగ్బంధం చేసి ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడితే కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక – ఏ జట్టు తమ ఈ అల్లర్ల నేపథ్యంలో తమ ఆటగాళ్లను వెనక్కి పిలిచింది. ఇది పీసీబీకి గట్టి ఎదురుదెబ్బే. ఇదే కారణాన్ని చూపుతూ మరికొన్ని దేశాల బోర్డులు తమ ఆటగాళ్లను పాక్‌కు పంపడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు పాకిస్థాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఉంటుందా? అనేది అనుమానంగా మారింది. ఒకవేళ టోర్నీ మొత్తం రద్దు చేయాలని భావిస్తే తాము చాంపియన్స్ ట్రోఫీని ఎక్కడ నిర్వహించినా పాల్గొనేది లేదని పీసీబీ ఇప్పటికే బెదిరింపులకు దిగిన నేపథ్యంలో శుక్రవారం సమావేశంలో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరం.
చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత్ తమ దేశానికి రాకుంటే తామూ ఇకపై ఆ దేశంలో జరిగే ఐసీసీ ఈవెంట్లకు వెళ్లేది లేదని పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ గురువారం తెలిపాడు. ‘భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీలు ఆడేందుకు మేం వెళ్తున్నాం. కానీ వాళ్లు ఇక్కడకు రాకపోవడం ఆమోదయోగ్యం కాదు. ఒకవేళ భారత్ అదే పద్ధతిని కొనసాగిస్తే భవిష్యత్‌లో భారత్‌లో జరిగే టోర్నీలకు మేమూ జట్టును పంపబోమ’ని స్పష్టం చేశాడు. డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జై షా.. బీసీసీఐ సెక్రటరీగా కాకుండా ప్రపంచ క్రికెట్ ప్రయోజనాల కోసం పనిచేయాలని తాము ఆశిస్తున్నట్టు చెప్పాడు.