కరాచీ: పాకిస్థాన్‌లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీపై వివాదం రాజుకుంటూనే ఉన్నది. ఆ టోర్నీ కోసం హైబ్రిడ్ మోడల్(Hybrid Model)ను వినియోగిస్తే, దాన్ని ఆమోదించబోమని ఇవాళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఈ విషయాన్ని చేరవేసింది. శుక్రవారం జరిగే ఐసీసీ బోర్డు వర్చువల్ మీటింగ్‌లో ఈ అంశమే కీలకం కానున్నది. పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ విముఖంగా ఉన్న నేపథ్యంలో.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నది. తటస్థ వేదికపై భారత్‌తో తలపడేందుకు పాకిస్థాన్ ఇష్టంగా లేదు. దీంతో ఆ టోర్నీ జరుగుతుందా లేదా అన్న సందిగ్ధత ఏర్పడింది.
హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించడం అంటే, ఇండియాకు ప్రిఫరెన్స్ ఇచ్చినట్లే అవుతుందని పాకిస్థాన్ బోర్డు వాదిస్తున్నది. ఒకవేళ హైబ్రిడ్ మోడల్‌కు అవకాశం ఇస్తే, అప్పుడు భవిష్యత్తులో ఐసీసీ అన్ని హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు పాకిస్థాన్ అనుమానం వ్యక్తం చేసింది. 2031లో భారత్, బంగ్లాదేశ్ కలిసి వన్డే వరల్డ్‌కప్ నిర్వహించే వరకు ఆ దేశానికి వెళ్లే పరిస్థితి ఉండదని పాక్ బోర్డు తెలిపింది. పాకిస్థాన్‌లో ఆడకూడదన్న విషయంపై భారత ప్రభుత్వం బీసీసీఐకి ఏదైనా లేఖ సమర్పించిందా అని కూడా పీసీబీ అడిగింది. ఐసీసీ ఆదాయ మార్గాల్లో బీసీసీఐ పాత్రను విస్మరించలేమని, కానీ ఇటీవల భారత్‌తో ఆడిన మ్యాచ్‌ల ద్వారా ఆదాయాన్ని ఆర్జించినట్లు పాకిస్థాన్ బోర్డు తెలిపింది.