2011 నుంచి టెస్టుల్లో ఏ జట్టుకైనా తొలి ఇన్నింగ్స్‌లో రెండో అత్యల్ప స్కోరుగా రికార్డు అయ్యింది. 2013లో న్యూజిలాండ్ పేరిట తక్కువ స్కోరు(45) నమోదైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు టెస్టుల్లో ఇది మూడో అత్యల్పస్కోరు (78). గతంలో వెస్టిండీస్‌పై (75), దక్షిణాఫ్రికా(76) టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్లుగా నమోదయ్యాయి.
లార్డ్స్ టు లీడ్స్. ఎంతలో ఎంత తేడా. అద్భుత విజయంతో సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఆధిక్యం సాధించిన భారత్..అదే జోరు కొనసాగించలేకపోయింది. మూడో టెస్టు మొదటి రోజే బ్యాటింగ్‌లో భారత్ కుప్పకూలింది. ఇంగ్లండ్ పేసర్ల విజృంభణతో టీమ్ఇండియా బ్యాటింగ్ పేకమేడను తలపించింది. స్వింగ్‌స్టర్ అండర్సన్..టాపార్డర్ భరతం పడితే..రాబిన్సన్, ఒవర్టన్ వికెట్ల వేట కొనసాగించడంతో కోహ్లీసేన 78 పరుగులకే ఢమాల్ అంది. ఒకరిని మించి మరొకరు పెవిలియన్‌కు పోటీపడటంతో టెస్టుల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని మూడో అత్యల్ప స్కోరును భారత్ తమ పేరిట లిఖించుకుంది. అందుకు భిన్నంగా హమీద్, బర్న్స్ జోడీ అజేయ అర్ధసెంచరీలతో వికెట్ కోల్పోకుండా ఇంగ్లండ్ తొలి రోజును ఘనంగా ముగించింది.
లీడ్స్: లార్డ్స్ టెస్టులో చరిత్రాత్మక విజయంతో ఆధిక్యం దక్కించుకున్న టీమ్ఇండియా మూడో టెస్టులో ఆదిలోనే కోలుకోలేని దెబ్బతిన్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ కోహ్లీ నిర్ణయం బుమారాంగ్లా బెడిసికొట్టింది. కొట్టిన పిండిల్లాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లండ్ పేస్ దళం భారత బ్యాట్స్‌మెన్ భరతం పట్టారు. లార్డ్స్ టెస్టు ఓటమితో కసి మీదున్న ఇంగ్లండ్ పేసర్లు టీమ్ఇండియా బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. అండర్సన్(3/6) వికె ట్ల వేటకు ఆరంభం పలికితే..ఒవర్టన్ (3/14), రాబిన్సన్ (2/16), కరాన్ (2/27) మిగతా పని పూర్తి చేశారు. వీరి విజృంభణతో టీమ్ఇండియా 40.4 ఓవర్లలో 78 పరుగులకే చాపచుట్టింది. ఓపెనర్ రోహిత్‌శర్మ(19), రహానే(18) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇందులో ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు రావడం విశేషం. 22 పరుగుల తేడాతో భారత్ చివరి ఏడు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇదిలా ఉంటే కోహ్లీసేనను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ఇంగ్లండ్..బ్యాటింగ్‌లోనూ ఇరగదీసింది. ఓపెనర్లు హమీద్(60 నాటౌ ట్), బర్న్స్(52 నాటౌట్) అజేయ అర్ధసెంచరీలతో తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 42 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది.
మూడో టెస్టు మొదటి రోజే భారత్‌కు ఏదీ కలిసిరాలేదు. గెలువక గెలువక టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం టీమ్ఇండియా ఏ కోశాన మనకు లాభించలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌కు దిగిన అండర్సన్..ఐదో బంతికే ఇన్ఫామ్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్(0)ను ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. ఔట్ స్వింగ్ డెలివరీని షాట్ ఆడబోయిన రాహుల్..కీపర్ బట్లర్ చేతికి లడ్డులా దొరికాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన పుజారా(0) తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఎదురొడ్డి నిలుస్తాడనుకున్న క్షణాన అండర్సన్ విసిరిన సూపర్ బంతికి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఓ ఎండ్‌లో రోహిత్‌శర్మ అడపాదడపా షాట్లతో స్కోరు బోర్డును పరిగెత్తిస్తే..మరో ఎండ్‌లో సహకరమిచ్చే వారు కరువయ్యారు. భారీ ఇన్నింగ్స్ బాకీ పడిన కెప్టెన్ కోహ్లీ మరోమారు నిరాశపరిచాడు. అండర్సన్ స్వింగ్ సరిగ్గా అర్థం చేసుకోని విరాట్..ఏడోసారి వికెట్ సమర్పించుకున్నాడు. రోహిత్‌కు రహానే జతకలిసిన తర్వాత ఇన్నింగ్స్ ఒక రకంగా కుదుటపడింది. ఇంగ్లండ్ పేస్ దాడిని సమర్థంగా నిలువరించే ప్రయత్నం చేసింది. ఈ జోడీ కుదురుకుంటున్న తరుణంలో రహానేను రాబిన్సన్ పెవిలియన్ పంపాడు. ఇక్కణ్నుంచి టీమ్ఇండియా ఇన్నింగ్స్ సైకిల్ స్టాండ్‌ను తలపించింది. ఇదే అదునుగా ఇంగ్లిష్ పేసర్లు చెలరేగి వరుస విరామాల్లో వికెట్లు నేలకూల్చారు. దీంతో 20 పరుగుల తేడాతో 6వికెట్లు కోల్పోయింది.
స్కోరుబోర్డు: భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్‌శర్మ(సి)రాబిన్సన్(బి)ఒవర్టన్ 19, రాహుల్(సి)బట్లర్(బి)అండర్సన్ 0, పుజారా(సి)బట్లర్(బి)అండర్సన్ 1, కోహ్లీ(సి)బట్లర్(బి)అండర్సన్ 7, రహానే(సి)బట్లర్(బి)రాబిన్సన్ 18, పంత్(సి)బట్లర్(బి)రాబిన్సన్ 2, జడేజా (ఎల్బీ) కరాన్ 4, షమీ(సి)బర్న్స్(బి)ఒవర్టన్ 0, ఇషాంత్ 8 నాటౌట్, బుమ్రా(ఎల్బీ)కరాన్ 0, సిరాజ్(సి)రూట్(బి) ఒవర్టన్ 3; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 40.4 ఓవర్లలో 78 ఆలౌట్; వికెట్ల పతనం: 1-1, 2-4, 3-21, 4-56, 5-58, 6-67, 7-67, 8-67, 9-67, 10-78; బౌలింగ్: అండర్సన్ 8-5-6-3, రాబిన్సన్ 10-3-16-2, కరాన్ 10-2-27-2, అలీ 2-0-4-0, ఒవర్టన్ 10.4-5-14-3.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ 52 నాటౌట్, హమీద్ 60 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 42 ఓవర్లలో 120; బౌలింగ్: ఇషాంత్ 7-0-26-0, బుమ్రా 12-5-19-0, షమీ 11-2-39-0, సిరాజ్ 7-1-26-0, జడేజా 5-3-6-0.