ఇటీవలి కాలంలో క్రికెట్లో సంచలనంగా మారిన విషయం ‘నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్’. బౌలర్ బంతిని డెలివర్ చేయడానికి ముందే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటితే అతన్ని రనౌట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు దీన్ని ‘మన్కడింగ్’ అని పిలిచేవారు.
అయితే తాజాగా ఐసీసీ నిబంధనల్లో దీన్ని రనౌట్‌గా చేర్చారు. దీనిపై తాజాగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘ఇది ఒక రూల్. రూల్ అంటే రూల్ అంతే, స్పిరిట్ ఆఫ్ ది గేమ్ అంటూ కథలు వద్దు. నేను క్రీజు దాటితే నన్ను కూడా అవుట్ చేసుకోవచ్చు. అది నా తప్పే అవుతుంది’ అని తేల్చేశాడు.
దీంతో పాకిస్తాన్‌తో జరిగిన మెగా టోర్నీ ఓపెనర్‌లో హార్దిక్ ఎన్నిసార్లు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజు దాటాడు? అని కొందరు ప్రశ్నించారు. గతంలో దీప్తి శర్మ వివాదంలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన క్రికెట్ అనలిస్ట్ పీటర్ డెల్లా పెన్నా ఈసారి కూడా తన పరిశీలనా శక్తికి పదునుపెట్టాడు. భారత్, పాక్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరు ఎన్నిసార్లు ఇలా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజు దాటిందీ లెక్కలు వేసి మరీ చెప్పాడు.
టీమిండియాలో కోహ్లీ (24 శాతం) అత్యధిక సార్లు క్రీజు దాటాడట. ఇంకా క్లియర్‌గా చెప్తే అతని బ్యాటు క్రీజులో ఉన్నా కూడా.. గాల్లో ఉంది. చాలాసార్లు కోహ్లీ.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజు బయటే ఉన్నాడు. ఆ సమయంలో అతని బ్యాటు క్రీజులోపలే ఉంది కానీ గాల్లో వేలాడుతోందని వివరించాడు. అలాగే భారత బ్యాటింగ్ సమయంలో మొత్తం 126 డెలివరీలు వేయగా.. ఈ సమయంలో కేవలం 25 సార్లు మాత్రమే భారత బ్యాటర్లు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజు దాటారని తేల్చిచెప్పాడు.
ఇక పాకిస్తాన్ బ్యాటర్ల విషయానికొస్తే.. ఇఫ్తికర్ అహ్మద్ (94 శాతం), షాన్ మసూద్ (47 శాతం), బాబర్ ఆజమ్ (43 శాతం) చాలాసార్లు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజు వదిలి బయటకు వచ్చారని వెల్లడించాడు. మొత్తం 16 డెలివరీలకు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఇఫ్తికర్ 15 సార్లు క్రీజు దాటి ముందుకు వచ్చేశాడు. షాన్ మసూద్ 35 సార్లు క్రీజు దాటేశాడు. వీళ్లిద్దరూ కలిసి బంతి డెలివరీకి ముందే ఏకంగా 50 సార్లు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజు దాటి వచ్చేశారని పీటర్ డెల్లా పెన్నా విశ్లేషించాడు.
రెండు జట్లకు సంబంధించిన స్క్రీన్షాట్లను షేర్ చేసిన అతను.. ‘భారత ఆటగాళ్లు క్రీజు దాటిన ఫొటోలు షేర్ చేయవని కొందరు గొడవ చేస్తున్నారు. అవి ఎందుకు చేయనంటే.. సాధారణంగా భారత ఆటగాళ్లు అలా క్రీజు దాటరు. ఇప్పుడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వివరాలు షేర్ చేస్తున్నా. ఈ మ్యాచ్‌లో చూసినా భారత ఆటగాళ్లు అత్యధిక శాతం క్రీజులోనే ఉన్నారు. కోహ్లీ, పాండ్యానే క్రీజు దాటి కనిపించారు’ అని ట్వీట్ చేశాడు.
Here's the whole India innings charting balls that batters left early from non-striker's end.
Rohit: 5/13 (38%)
Rahul: 0/3
SKY: 0/3
Axar: 0/1
Kohli: 14/59 (24%)
Hardik: 5/43 (12%)
DK: 1/4 (25%).
Team total: 25/126 (19.8%).
This is as bad as it got for Kohli, dangling bat in air. pic.twitter.com/9wPXagnBB4— Peter Della Penna (@PeterDellaPenna) October 23, 2022