రాజ్‌గిర్: ప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ దుమ్మురేపింది. సోమవారం జరిగిన పూల్-ఏ ఆఖరి పోరులో భారత్ 15-0 తేడాతో పసికూన కజకిస్థాన్‌పై రికార్డు విజయం సాధించింది. తద్వారా గ్రూపులో అగ్రస్థానంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ మొదటి నిమిషం నుంచి మొదలైన భారత్ ఆధిపత్యం ఆఖరిదాకా దిగ్విజయంగా కొనసాగింది. అంతగా అనుభవం లేని కజకిస్థాన్ డిఫెన్స్‌ను కకావికలు చేస్తూ భారత్ గోల్స్ వర్షం కురిపించింది.
నాలుగు క్వార్టర్లలో బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న టీమ్ఇండియా..కీలకమైన సెమీస్‌కు ముందు ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి అర్ధభాగంలోనే కజకిస్థాన్‌పై 7-0తో స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన భారత్ అదే జోరు కొనసాగించింది.
భారత్ తరఫున అభిషేక్ (5ని, 8ని, 20ని, 59ని), సుఖ్జీత్సింగ్ (15ని, 32ని, 38ని), జుగ్రాజ్సింగ్ (24ని, 31ని, 47ని) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్ (26ని), అమిత్ రోహిదాస్ (29ని), రాజిందర్‌సింగ్ (32ని), సంజయ్‌సింగ్ (54ని), దిల్‌ప్రీత్‌సింగ్ (55ని) ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరిగే హాకీ ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది.