హాంకాంగ్: ఇటీవలే ముగిసిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో మెరిసిన భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. హాంకాంగ్ వేదికగా జరుగుతున్న హాంకాంగ్ సూపర్ 500 టోర్నమెంట్లో ఈ ద్వయం సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ.. 21-14, 20-22, 21-16తో మలేషియాకు చెందిన అరిఫ్ జునైది-రాయ్ కింగ్‌ను మట్టికరిపించింది.
64 నిమిషాల పాటు సాగిన పోరులో 8వ సీడ్ భారత ద్వయం తొలి గేమ్‌ను నెమ్మదిగానే ఆరంభించింది. స్కోరు 12-12తో సమంగా ఉండగా భారత షట్లర్లు జోరు పెంచి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లోనూ హోరాహోరీగా తలపడ్డా మలేషియా జంట ఆఖరిదాకా పోరాడి మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక గేమ్‌లో భారత జోడీ జోరు ముందు అరిఫ్-రాయ్ నిలువలేకపోయారు. ఇక పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్21-16, 17-21, 21-13తోఆయుష్ శెట్టిపై గెలిచి సెమీస్ చేరాడు.