అహ్మదాబాద్: ఈ నెల 9న కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగి మ్యాచ్ ఆఖరి ఓవర్లో గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి ఓవర్లో కోల్‌కతా విజయానికి 28 పరుగులు కావాల్సి ఉండగా మొదట డాట్ బాల్ వేసి.. తర్వాత ఐదు బంతులు వరుసగా సిక్సర్లు ఇచ్చాడు. కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ వీరవిహారం చేశాడు. దాంతో కోల్‌కతా జట్టు అనూహ్య విజయం సాధించింది.
ఆ మ్యాచ్ తర్వాత నుంచి యశ్ దయాల్ ఫీల్డ్‌లో కనిపించలేదు. దీనిపై వారం క్రితం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. యశ్ ఆరోగ్యం బాగాలేదని, అతను తవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని చెప్పాడు. 7 నుంచి 8 కేజీల బరువు కూడా తగ్గాడని తెలిపాడు. యశ్ ఫీల్డ్‌లో కనిపించడానికి ఎక్కువ సమయమే పట్టవచ్చని అన్నాడు.
దాంతో రింకూ సింగ్ కొట్టిన సిక్సర్లే యశ్ దయాల్‌కు జ్వరం పట్టేలా చేశాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో గుజరాత్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పందించాడు. యశ్ దయాల్ జ్వరానికి, ఆ ఐదు సిక్సర్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. వైరల్ ఫీవర్ వల్ల దయాల్ బరువు తగ్గిపోయాడని వెల్లడించాడు.