IPL 2023 : ఈరోజు మొహాలీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్లు తలపడుతున్నాయి. అయితే.. ఈ మ్యాచ్ భారీ భద్రత నడుమ జరగనుంది. కారణం ఏంటంటే..? అరెస్టు చేసిన సిక్కు వేర్పాటు వాదులను విడుదల చేయాలని, లేదంటే మొహాలీ స్టేడియంలో మ్యాచ్‌ను అడ్డుకుంటామని నిహంగ(Nihangs) సిక్కు వర్గానికి చెందిన గ్రూప్ బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో స్టేడియం దగ్గర మోహరించారు.
పదహారో సీజన్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. లక్నో ఆటగాళ్లు కేల్ మేయర్స్, నికోలస్ పూరన్, స్టోయినిస్ నిలకడగా రాణిస్తున్నారు. ఇక పంజాబ్ ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, సామ్ కరన్, అర్ష్‌దీప్ సింగ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ చేతిలో లక్నో కంగుతిన్నది. పంజాబ్ కింగ్స్ బలమైన ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.
నెట్ రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న కేఎల్ రాహుల్ సేన పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. పంజాబ్ మాత్రం ఆరో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే పాయింట్లతో పాటు రన్‌రేటు కూడా ముఖ్యమే. దాంతో, ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో విజయంపై కన్నేశాయి. ఆడిన ఏడు మ్యాచుల్లో ఇరుజట్లు నాలుగు విజయాలు సాధించాయి.