హైదరాబాద్, ఏప్రిల్ 21,(నమస్తే తెలంగాణ): నిధుల దుర్వినియోగ అభియోగాల నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు ఏమీ తీసుకోరాదని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సిబ్బంది జీతభత్యాలు, రోజువారీ ఖర్చులకు మాత్రమే చెల్లింపులు చేయాలని, ఇతర ఆర్థిక విధాన నిర్ణయాల జోలికి వెళ్లరాదని చెప్పింది. హెచ్‌సీఏలో నిధుల దుర్వినియోగంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదంటూ తెలంగాణ క్రికెట్అసోసియేషన్(టీసీఏ) దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి విచారణ చేపట్టారు. సీనియర్ న్యాయవాది రాజాశ్రీపతిరావు వాదిస్తూ, హెచ్‌సీఏ మేనేజింగ్ కమిటీ నిధుల దుర్వినియోగ చర్యలు తీసుకుందని, ఖాతాలను సక్రమంగా నిర్వహించలేదని చెప్పారు.
ప్రస్తుత మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లేకపోయినప్పటికీ వాస్తవాలను దాచిపెట్టి పోటీ చేసి గెలిచారన్నారు. ఇప్పటికే గత ఆఫీసు బేరర్లపై కేసు ఉందని, బ్యాట్లు, బంతులు, జిమ్ పరికరాల కోసం అధిక ధరలతో అగ్రిమెంట్లు చేసుకున్నారని చెప్పారు. క్విడ్‌ప్రోకో కింద లబ్ధి పొందిన గత కమిటీ ఉపాధ్యక్షుడు సురేందర్ అగర్వాల్‌కు చెందిన రూ.51.29 లక్షలను ఈడీ జప్తు చేసిందని గుర్తు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా ఉందన్నారు.
హెచ్‌సీఏ తరఫున సీనియర్ న్యాయవాది జె.రామచంద్రరావు ప్రతివాదన చేస్తూ, ఇటీవలే మేనేజింగ్ కమిటీ ఎన్నికైందని, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా విచారణాధికారి నియమితులయ్యారని చెప్పారు. విచారణాధికారి పర్యవేక్షణలోనే ఎన్నికలు జరిగాయన్నారు. ఆరోపణలన్నీ గత పాలకవర్గంపైనే అని చెప్పారు. అసోసియేషన్ నిబంధనల ప్రకారమే నిర్వహణ జరుగుతోందన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, మేనేజింగ్ కమిటీపై తీవ్రమైన ఆరోపణలని, ఇవి విచారణలో తేలాల్సి వుందని, ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు తీసుకోవడం సబబుకాదని స్పష్టం చేసింది. రోజువారీ ఖర్చులు, జీతభత్యాల చెల్లింపులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.