అహ్మదాబాద్: ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ఈ నెల 9న జరిగిన 13వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో విజయానికి 28 పరుగులు కావాల్సి ఉంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ భారాన్ని బౌలర్ యశ్ దయాల్‌పై వేశాడు. కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. యశ్ తొలి బంతి విసిరాడు. పరుగులేమీ రాలేదు.
ఇక 5 బంతుల్లో 28 పరుగులు కావాల్సి ఉంది. గుజరాత్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ రింకూ సింగ్ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. యశ్ దయాల్ వేసిన మిగతా ఐదు బంతులను సిక్సర్లుగా మలిచాడు. కోల్‌కతాకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ ఘట్టం బౌలర్ యశ్ దయాల్‌కు ఓ పీడకలగా మిగిలిపోయింది.
ఆ మ్యాచ్ తర్వాత యశ్ దయాల్ పూర్తిగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో యశ్ దయాల్ తిరిగి ఫీల్డ్‌లో ఎప్పుడు కనిపిస్తాడంటూ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దాంతో.. ప్రస్తుతం యశ్ దయాల్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన 7 నుంచి 8 కిలోల బరువు కూడా తగ్గాడని హార్దిక్ పాండ్యా చెప్పారు. యశ్‌ను తిరిగి ఫీల్డ్‌లో చూడటానికి ఎక్కువే సమయమే పట్టవచ్చన్నారు.