హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను సీఐడీ అధికారులు తొలిరోజు విచారించారు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ కోరగా.. మల్కాజిగిరీ కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో గురువారం తొలిరోజు నిందితులైన జగన్మోహన్రావు, కవిత యాదవ్, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, శ్రీనివాసరావును విచారించి.. సీఐడీ సమాచారం రాబట్టింది.
కాగా, బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారనే కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. గతంలో నమోదైన రెండు ఎఫ్ఐఆర్లను కలిపి.. తాజాగా ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై సీఐడీ కస్టడీ ముగిసిన వెంటనే.. ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే, హెచ్‌సీఏ అక్రమాలను వెలుగు తీయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) గురువారం సీఐడీ డీజీ చారుసిన్హాను కలిసి వినతిపత్రం ఇచ్చింది.