Harry Brook : టీ20ల మజా తెలిసిన ఈకాలం కుర్రాళ్లు ఎవరైనా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతారు. అందులోనూ కోట్లు కురిపించే ఐపీఎల్(IPL)లో ఆడాలని ఎన్నో కలలు కంటారు. కోసం సొంత దేశం తరఫున ఆడేందుకు అయిష్టం చూపుతుంటారు కొందరు క్రికెటర్లు. ఐపీఎల్ కోసం తమ షెడ్యూల్ వాయిదా వేసే బోర్డులు.. జాతీయ జట్టునే వదిలేసిన ఆటగాళ్లను చూశాం. కానీ, హ్యారీ బ్రూక్ (Harry Brook) మాత్రం అలా కాదు. తనకు ఫ్రాంచైజీ క్రికెట్ కంటే దేశమే ముఖ్యమని అంటున్నాడీ చిచ్చరపిడుగు.
ఇంగ్లండ్ వన్డే, టీ20 కెప్టెన్‌గా ఎంపికైన బ్రూక్ మాట్లాడుతూ .. ‘నేను ఇంగ్లండ్ తరఫున ఆడాలని మాత్రమే అనుకుంటున్నా. మా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప గౌరవం. ఇంతకుముందు జట్టు విజయం కోసం ఎంతగా తపించేవాడినో.. ఇప్పుడు సారథిగా అంతే తపన కనబరుస్తాను. నా నాయకత్వంలో ఇంగ్లండ్ వైట్ బాల్ క్రికెట్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. ఈమధ్య కాలంలో అందరూ ఫ్రాంచైజ్ క్రికెట్ మీద ఆసక్తి చూపిస్తున్నారు.
నా దృష్టిలో దేశం కంటే ఏ లీగ్ గొప్పది కాదు. ఐపీఎల్ అయినా సరే నా తొలి ప్రాధాన్యం మాత్రం ఇంగ్లండ్‌కే. అందకే.. మా దేశం జెర్సీతో మైదానంలోకి దిగిన రోజున నా మనసెంతో ఉప్పొంగిపోతుంది. ఐపీఎల్‌కు దూరం కావడం వల్ల కోట్లలో డబ్బు కోల్పోతున్నా. ఒకవేళ ఇలాంటి ఫ్రాంచైజ్ క్రికెట్లో భాగమైనా సరే.. దేశం తరఫున ఆడాల్సి వస్తే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోను’ అని బ్రూక్ వెల్లడించాడు. ఇంగ్లండ్ సారథిగా బ్రూక్‌కు మే నెలలో తొలి సవాల్ ఎదురుకానుంది. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు వెస్టిండీస్ జట్టు రానుంది.
Harry Brook says he’s putting franchise cricket on the back burner to give his all as England’s new white-ball captain 🏴 pic.twitter.com/GTaeVaswRT
— ESPNcricinfo (@ESPNcricinfo) April 9, 2025
రెండేళ్లుగా టీ20, టెస్టుల్లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతున్న బ్రూక్ ఐపీఎల్లో భారీ ధర పలికాడు. 18వ సీజన్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.6.25 కోట్లకు కొన్నది. కానీ, బిజీ షెడ్యూల్ కారణంగా వైదొలుగుతున్నాని డీసీకి మెసేజ్ పంపాడు బ్రూక్. దాంతో, నిబంధనలను ఉల్లఘించినందుకు ఈ ఇంగ్లండ్ స్టార్‌పై రెండేళ్ల నిషేధం విధించింది ఐపీఎల్ పాలకమండలి. 16వ సీజన్లో రూ.13.5 కోట్లకు సన్‌రైజర్స్ యాజమాన్యం బ్రూక్‌ను కొనుగోలు చేసింది. అయితే. కోల్‌కతాపై సెంచరీతో సరిపుచ్చాడీ బ్యాటర్. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారిన అతడిని ఆరెంజ్ ఆర్మీ వదిలేసింది.