IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో స్టార్ ఆటగాళ్లు ‘రిటైర్డ్ ఔట్’ (Retired Out) అవుతుండడం వివాదం రేపుతోంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకూ ఇద్దరు ఆటగాళ్లు ఔట్ కాకముందే క్రీజు వదిలేసి వెళ్లారు. ఒకరు ముంబై ఇండియన్స్ క్రికెటర్ తిలక్ వర్మ(Tilak Varma) కాగా.. రెండో ఆటగాడిగా డెవాన్ కాన్వే(Devan Conway) నిలిచాడు. దాంతో, అసలు ‘రిటైర్ట్ ఔట్’కు, ‘రిటైర్డ్ హర్ట్’కు తేడా ఏంటి? అనే సందేహం వస్తోంది చాలామందికి. దాదాపు ఒకే అర్థం గోచరించేలా ఉన్న ఈ రెండు పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. అదేంటో తెలుసుకుందాం..
క్రికెట్ ఆటలో రిటైర్డ్ హర్ట్ (Retired Hurt) కావడం అనేది ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఈ విధంగా పెవిలియన్ చేరిన క్రికెటర్లు చాలామందే. రిటైర్డ్ హర్ట్ అంటే.. ఒక ఆటగాడు గాయం లేదా అనారోగ్యం కారణంగా మైదానం వీడతాడు. కొంతసేపటికి అతడు/ ఆమె ఫిట్‌గా ఉంటే మళ్లీ ఆడే అవకాశం ఉంటుంది. లేదంటే.. తమ జట్టు ఆలౌట్ ప్రమాదంలో ఉన్నప్పుడు రిటైర్డ్ హర్ట్ అయిన వాళ్లు అతికష్టమ్మీద క్రీజులోకి వచ్చి పోరాడతారు. ఒకవేళ సదరు క్రికెటర్ కోలుకోకుంటే మాత్రం అంపైర్ ఔట్‌గా ప్రకటిస్తారు.
You will not see a more courageous effort than Hayley Matthews against Scotland today 💪
• Retired hurt with severe cramp on 95*
• Returned with her side eight down
• Stretchered off again one ball later on 99*
• Ninth wicket fell the next ball, she walks back on
• Reached… pic.twitter.com/XAOjLNWt9v— ESPNcricinfo (@ESPNcricinfo) April 9, 2025
అదే రిటైర్డ్ ఔట్ అంటే.. ఇది ఒక వ్యూహాత్మక నిర్ణయం. పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న బ్యాట్లర్లను ఆఖరి ఓవర్లలో ఇలా పెవిలియన్‌కు పిలుస్తారు. ఈ విధంగా మైదానం వీడిన క్రికెటర్ ఔట్ అయినట్టే లెక్క. అతడు/ ఆమె మళ్లీ బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ 9 వికెట్లు పడినా సరే రిటైర్డ్ ఔట్‌గా డగౌట్ చేరిన క్రికెటర్ ఆడే అవకాశం ఉండదు. కాబట్టి.. ఆ జట్టుకు ఓటమి తప్పదు.
🚨 Tilak Varma retires out after struggling in the middle with a 23-ball 25 🤯#IPL #LSGvMI pic.twitter.com/Axc3RhjV4E
— Cricbuzz (@cricbuzz) April 4, 2025
ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మను రిటైర్డ్ ఔట్‌గా వెనక్కి పిలవడం పెద్ద దుమారమే రేపింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఆడిన అతడు కోచ్, కెప్టెన్ల సూచన మేరకు డగౌట్‌కు వెళ్లిపోయాడు. మ్యాచ్ విన్నర్ అయిన తిలక్‌కు పెద్ద అవమానం అని ఫ్యాన్స్ హెడ్‌కోచ్ జయవర్దనే, సారథి హార్దిక్ పాండ్యాలపై విమర్శలు గుప్పించారు. అయితే.. తిలక్‌ను అలా వచ్చేయమనడం తమ వ్యూహాత్మక నిర్ణయమని జయవర్దనే సమర్ధించుకున్నాడు.
ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) సైతం ఓపెనర్ డెవాన్ కాన్వేను రిటైర్డ్ ఔట్‌గా వెనక్కి పిలిచింది. అయితే తిలక్, కాన్వేల రిటైర్డ్ ఔట్ నిర్ణయంతో ముంబై, సీస్కేలు లబ్ది పొందలేదు. లక్నో చేతిలో పాండ్యా సేన 12 పరుగుల తేడాతో చిత్తు అయింది. కాన్వే తర్వాత వచ్చిన జడేజా త్వరగానే ఔట్ కావడంతో సీఎస్కే సైతం ఓటమిపాలైంది.