Suma | తెలుగు టెలివిజన్ ప్రపంచంలో యాంకర్ సుమ కనకాల పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమ.. గత 20 ఏళ్లుగా యాంకరింగ్ రంగంలో అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు. 50 ఏళ్లు దాటినా అదే ఎనర్జీ, అదే టైమింగ్, అదే ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మలయాళ కుటుంబానికి చెందిన సుమ.. తెలుగును అనర్గళంగా మాట్లాడగలగడం ఆమెకు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. అంతేకాదు తెలుగు సహా ఐదు భాషలను సులభంగా మాట్లాడగల సామర్థ్యం ఆమెకు ఉంది. ముఖ్యంగా ఆమె మాట తీరు, స్పష్టమైన ఉచ్చారణ, టైమింగ్‌తో చెప్పే కామెడీ, ఎనర్జిటిక్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయి.
టాలీవుడ్లో ఎలాంటి పెద్ద ఈవెంట్ జరిగినా అక్కడ సుమ ఉండాల్సిందే అన్నంతగా ఆమె క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, ట్రైలర్ లాంచ్‌లు, అవార్డు వేడుకలు.. ఇలా ఏ కార్యక్రమమైనా సుమ తనదైన శైలిలో విజయవంతంగా నిర్వహిస్తుంటారు. ఎన్నేళ్లు గడిచినా ఆమె యాంకరింగ్‌లో అదే ఫ్రెష్‌నెస్ కనిపించడం విశేషం.సుమ సక్సెస్ వెనుక ఆమె డెడికేషన్, టైమ్ సెన్స్ ప్రధాన కారణాలని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. చిన్న ఈవెంట్ అయినా, పెద్ద కార్యక్రమమైనా సమయానికి హాజరు కావడం ఆమె అలవాటు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రొఫెషనలిజాన్ని మాత్రం ఎప్పుడూ మిస్ కాకుండా చూసుకుంటారు.
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సుమ తన కెరీర్లో ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. యాంకర్స్ స్రవంతి, వర్ష, గీతాభగత్లతో కలిసి చేసిన ఈ షోలో పాత జ్ఞాపకాలను ఆమె పంచుకున్నారు.ఈ సందర్భంగా ఓ లైవ్ షో కోసం తాను ఎదుర్కొన్న పరిస్థితిని సుమ వివరించారు. “గతంలో నేను మా టీవీలో ఒక లైవ్ షో చేసేదాన్ని. లైవ్ కావడంతో ప్రతిరోజూ టైంకి ఛానెల్‌కి వెళ్లాలి. ఒక రోజు పంజాగుట్ట దగ్గర భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాను. వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు షో టైమ్ దగ్గరపడుతోంది” అని చెప్పారు.ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు కారు దిగి రోడ్డుమీదే పరిగెత్తడం ప్రారంభించాను. అలా పంజాగుట్ట నుంచి మా టీవీ ఆఫీస్ వరకు పరుగెత్తుకుంటూ వెళ్లాను. అక్కడికి వెళ్లాక లిఫ్ట్ కూడా పని చేయలేదు. దాంతో నాలుగు అంతస్తులు మెట్లపై పరుగెత్తుకుంటూ ఎక్కాను. చివరకు లైవ్ ప్రారంభమయ్యే సరికి సరిగ్గా స్టూడియోలోకి చేరుకుని షో ప్రారంభించాను అంటూ సుమ చెప్పుకొచ్చారు. సుమ అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.