Bihar : బిహార్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. గంగా నదిలో పడవ బోల్తా పడటంతో పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటన బిహార్ రాజధాని పాట్నా జిల్లా, బార్హ్ సబ్ డివిజన్ పరిధిలోని ఉమానాథ్ ఘాట్ వద్ద గంగా నదిలో గురువారం జరిగింది. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గంగా నదిలో 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న చిన్న పడవ బోల్తా పడింది.
నీటి ప్రవాహం, గాలి, అలల ధాటికి పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పడవ బోల్తా పడటంతో అక్కడే ఉన్నవారు ఇతర చిన్న పడవల ద్వారా కొందరిని రక్షించారు. ఏడుగురు గల్లంతయ్యారు. నదిలో గల్లంతైన వారికోసం స్టేట్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గల్లంతైన ఏడుగురిలో ఇద్దరి మృతదేహాలు లభించినట్లు బార్హ్ ఎస్డీపీఓ రామకృష్ణ తెలిపారు. పడవ బోల్తా పడినట్లు తమకు సమాచారం అందిందని, ఘటన జరిగిన సమయంలో పడవలో 14 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో ఏడుగురిని రక్షించినట్లు చెప్పారు.
#WATCH | Several dead after a boat capsized in the Ganga River near Umanath Ghat in the Barh subdivision of Patna district, Bihar pic.twitter.com/u2ucsGQvsn
— ANI (@ANI) May 28, 2026
మిగతా ఏడుగురు గల్లంతు కాగా, ఇద్దరి మృతదేహాలు లభించాయన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు. మరోవైపు ముంబైలో కూడా ఒక చేపల బోటు బోల్తా పడటంతో ఒకరు మరణించారు. ఖర్ దండా ఏరియాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మరో ఇద్దరు గాయపడగా, వారిని అధికారులు రక్షించారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.